Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లిం మహిళలపై లైంగిక వేధింపులకు బహిరంగంగా ప్రేరేపించిన వారిని...
- రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మహిళా సంఘాలు వినతి
న్యూఢిల్లీ : ముస్లిం మహిళలపై లైంగిక వేధింపులకు బహిరంగంగా ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మరియం ధావలే ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా), అన్నీ రాజా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యు), కవితా కృష్ణన్ ఆల్ ఇండియా ప్రోగ్రెస్సివ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఎఐపీడబ్ల్యూ), పూనమ్ కౌశిక్ ప్రగతిశీల మహిళా సంగతన్ (పిఎంఎస్), ఛబీ మొహంతి ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘటన్ (ఎఐఎంఎస్ఎస్) సంయుక్తంగా వినతి అందజేశారు.దురదృష్టవశాత్తూ తాము అఅరు మాసాల వ్యవధిలో రెండవసారి అత్యంత అసహ్యకరమైన స్త్రీ ద్వేషాన్ని చూశామని, ముందుగా 2021 జూలైలో ప్రముఖ ముస్లిం మహిళలు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు మొదలైన వారిని 'వేలం' వేయడానికి ఉద్దేశించిన 'సుల్లి డీల్స్' అనే యాప్ సోషల్ మీడియాలో షేర్ చేయబడిందని పేర్కొన్నారు. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా రాసే, నిరసన తెలిపే ధైర్యవంతులైన ముస్లిం మహిళలను అవమానించడం, భయభ్రాంతులకు గురి చేయడం కోసం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో బాధ్యులపై ఎఫ్ఐఆర్లు యుపి, ఢిల్లీలో నమోదయ్యాయని, అయితే దురదృష్టవశాత్తు, ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా నేరపూరిత చర్యలకు పరిపాలనలోని విభాగాలు, న్యాయ వ్యవస్థ కూడా ప్రేక్షకులుగా విచారకరమని అన్నారు.క్రైస్తవులు, ముస్లింలు వంటి మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఎక్కడ బాధితులైనప్పటికీ, ద్వేషపూరిత ప్రసంగాలు, భౌతిక దాడులు, ప్రార్థన సమావేశాలను నిరోధించడం వంటివి జరిగినా పోలీసులు, పరిపాలన విభాగాలు, కోర్టులు కూడా మౌనంగా ఉంటున్నాయని వివరించారు. తరచుగా పోలీసులు భౌతికంగా ఘటనా స్థలం వద్ద ఉంటారని, కానీ జోక్యం చేసుకోరని అన్నారు. జోక్యం చేసుకోకపోతే నేరస్థులకు సహాయం చేయడం, ప్రోత్సహించడమే అవుతుందని అన్నారు. తత్ఫలితంగా, ద్వేషం, హింసను ప్రేరేపించే వారు మరింత క్రూరత్వానికి పాల్పడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నా రు.సుల్లి ఒప్పంద యాప్ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏడాది చివరలో 'బుల్లి బాయి' పేరుతో మరో యాప్ సోషల్ మీడియాలో కనిపించిందని అన్నారు. ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇస్మత్ అరా, రేడియో పర్సనాలిటీ సైమా వంటి అనేక మంది ప్రముఖ ముస్లిం మహిళలు పేరు పెట్టడమే కాకుండా, వారి ఫోటోలు మహిళలను వేలం వేయడం గురించి మాట్లాడే సైట్లో బహిరంగపరచబడ్డాయని తెలిపారు. నజీబ్ తల్లి ఫాతిమా అమ్మీ పేరు కూడా అందులో పెట్టారన్నారు. ఈ నీచమైన ప్రవర్త నపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందని, యాప్ వెనుక ఉన్న గిట్హబ్ వినియోగ దారున్ని 'బ్లాక్' చేసినట్టు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించినప్పటికి, ఇది చాలా బలహీనమైన, సరిపోని ప్రతిస్పందన అని పేర్కొన్నారు.పితృస్వామ్యం ప్రబలంగా ఉన్న దేశంలో మహిళలు అన్ని రంగాలలో అసమానతలకు గురవుతున్నారని, అంతులేని హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ బహిరంగ లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని సహించకూడదని అన్నారు. క్రైస్తవ, ముస్లిం వర్గాలకు చెందిన వారు భౌతిక, మాటల హింసను ఎదుర్కోవ డమే కాకుండా, హిందూ మత పెద్దలు అని పిలుచుకునే బహిరంగ సభల్లో మైనార్టీలపై మారణహౌమ దాడులు నిర్వహించాలని పిలుపులు ఇస్తున్న తరుణంలో ఈ తాజా దారుణం జరిగిందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నామని అన్నారు. ఈ నీచమైన, నేరపూరిత ప్రవర్తనకు బాధ్యులైన వారికి తగిన శిక్ష విధించేలా జోక్యం చేసుకోవడానికి మీ వద్ద ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించాలని, అత్యున్నత రాజ్యాంగ అధికారం మీకుందని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. తక్షణ, సానుకూల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.