Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టును కోరిన కేంద్రం
- ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సవాలు చేస్తూ పెండింగ్‌లో పిటిషన్లు
న్యూఢిల్లీ : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆలిండియా కోటాలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్) ల రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లపై నేడు (మంగళవారం) విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. పోస్టు-గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్ చెల్లుబాటును సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. దీంతో వీటిపై విచారణ జరపాలంటూ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. '' ఇందులో కొంత అత్యవసరం ఉన్నది. ఒకవేళ విచారణ రేపు ఉన్నట్టు మీరు పరిగణిస్తే.. పిటిషనర్ల తరఫున వాదించడానికి ఇక్కడ ఉండాల్సిందిగా సీనియర్ అడ్వకేట్ అరివింద్ దతర్ను అభ్యర్థించాను'' అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కాగా, ప్రభుత్వ అభ్యర్థన గురించి తాను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణతో మాట్లాడతానని జస్టిస్ డీవై చంద్రచూడ్ సొలిసిటర్ జనరల్‌కు చెప్పారు. ఒకవేళ మంగళవారం కుదరకపోతే తర్వాతి రోజైనా పిటిషన్ల విచారణ జరపాలని ఈ సందర్భంగా తుషార్ మెహతా కోర్టును కోరారు. కాగా, పిటిషన్లపై విచారణ మంగళవారం లేదా బుధవారం జరిగినా తనకు అభ్యంతరం లేదని పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేటు అరవింద్ దతర్ తెలిపారు. అయితే, వాస్తవానికి ఈ పిటిషన్లపై విచారణ గురువారం జరగాల్సి ఉన్నది.
ఈ కేసు పరిష్కారమయ్యే వరకూ మెడికల్ కోర్సుల కోసం కౌన్సిలింగ్‌ను జరపబోమని గతేడాది అక్టోబర్‌లో కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో కౌన్సిలింగ్ ఆలస్యం కావడంతో దేశవ్యాప్తంగా మెడికల్ అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రెసిడెంట్ డాక్టర్లు నిరసనలు సాగిస్తున్నారు.