Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానిపై మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
- రైతుల గురించి మాట్లాడితే.. అహంకారం ప్రదర్శించారు : సత్యపాల్ మాలిక్
- ఆ తర్వాత వ్యాఖ్యలు వెనక్కి..
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా రైతులకు మద్దతుగా నిలుస్తున్న మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఓ పొగరుబోతుగా మాట్లాడారంటూ వ్యాఖ్యానించారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధానికి మతిపోయిందని వ్యాఖ్యానించినట్టు ఆరోపించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకెళ్తే.. మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ ఆదివారం నాడు హర్యానాలోని దాద్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. 'ఇటీవల రైతుల సమస్యలపై మాట్లాడేందుకు నేను ప్రధానిని కలిశాను. ఈ సందర్భంగా కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రధానిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలా అహంకారం ప్రదర్శించారు. మన రైతులు దాదాపు 500 మంది చనిపోయారు అని నేను ప్రస్తావిస్తుండగానే.. 'వాళ్లు నాకోసం చనిపోయారా..? అంటూ ప్రధాని స్వరం పెంచారు' అని వెల్లడించారు. 'ప్రధాని అహంకారాన్ని ప్రదర్శిస్తూ.. వాళ్లు నా కోసం చనిపోయారా..?... అని నన్ను ప్రశ్నిస్తే.. దానిక నేను అవును అని సమాధానం ఇచ్చాను' అని మేఘాలయ గవర్నర్ సత్యాపాలిక్ మాలిక్ తెలిపారు. మీరు రాజు కాబట్టి రైతుల మరణాలకు మీరే బాధ్యులని చెప్పానని తెలిపారు.
ఆ తర్వాత.. అమిత్‌షాను కలిసి మాట్లాడమని ప్రధాని తనకు చెప్పారనీ అన్నారు. ఆయన చెప్పినట్టు తాను అమిత్ షాను కలిశానని అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రధానిని ఉద్దేశించి 'సత్యా.. ఆయనకు మతి తప్పింది' అని వ్యాఖ్యానించినట్టు తెలిపారు. కుక్క చచ్చినా సంతాప లేఖ పంపే ప్రధాని రైతుల మరణాలపై స్పందించలేదని విమర్శించారు. అయితే మాలిక్ కేంద్రంపై విరుచుకుపడటం ఇదేమీ తొలిసారి కాదూ. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వైఖరిని గతంలోనూ తప్పుపట్టారు. కాగా, దీనిపై విమర్శలు రావడంతో ప్రధాని మోడీ అలా అనలేదని, రైతు సమస్యపై చర్చించేందుకు తనకు సమయం లేదనీ, అమిత్ షాను కలవాలని ఆయన చెప్పారనీ. తన వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు ప్రయత్నించారు. అమిత్ షా కూడా ప్రధాని మోడీని ఏమీ అనలేదని చెప్పుకొచ్చారు.