Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి
- ప్రత్యేక హౌదాతో పాటు విభజన హామీలూ అమలు చేయాలి
- తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఆదేశాలివ్వండి
- ప్రధాని మోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భేటీ
- వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఊసెత్తని ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : పోలవరం పెండింగ్ నిధులు రూ.2,100 కోట్లు విడుదల చేయాలనీ, అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లు నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో జగన్మోహన్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో ఆ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, పెండింగ్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయని, రాష్ట్ర విభజన సమయంలో 58శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కిందని తెలిపారు. 2015-16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమేనని అన్నారు. విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయిందనీ, అక్కడ ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను కోల్పోయామని తెలిపారు. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాతోపాటు అనేక హామీలు ఇచ్చారనీ, వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుందని అన్నారు. కాని చాలా హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని పేర్కొన్నారు.
భూ సేకరణ చట్టం వల్లే పోలవరం ఖర్చు పెరిగింది
''2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 1 ఏప్రిల్ 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలియజేసింది. 2014 తరువాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్-90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం'' అని పేర్కొన్నారు.
తెలంగాణ ఇవ్వల్సిన విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఆదేశాలివ్వండి
''రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్కో విద్యుత్‌ను సరఫరా చేసింది. 2 జూన్ 2014 నుంచి 10 జూన్ 2017 వరకు విద్యుత్‌ను అందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్దిష్ట ఆదేశాల మేరకు ఆ విద్యుత్ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. కాని ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం'' అని పేర్కొన్నారు.
ఆహార భద్రతా చట్టంలో లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేకపోవడం రాష్ట్రానికి నష్టం
''జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేని విధానం వల్ల రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలో లబ్ది పొందుతున్న వారి సంఖ్య 2.68 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 61 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో 41 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. అర్హత ఉన్న చాలా మంది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కవర్ కావడం లేదు. అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఆ మేరకు ఎక్కువ మంది లబ్ధిదారులు కవర్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనీ, అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఊసెంత్తని సిఎం జగన్
ప్రధాని మోడీతో జరిగిన భేటీలో సిఎం వైఎస్ జగన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదు. 14 నెలలు తరువాత సోమవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. దాదాపు గంట పాటు సుదీర్ఘంగా రాష్ట్ర అంశాలు చర్చించినట్టు ప్రకటన విడుదల చేశారు. అందులో స్టీల్ ప్లాంట్ అంశమే లేదు. గమనార్హం.