Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన బంధువు వీరేంద్ర శుక్లా కూడా నిందితుడే
- లఖింపూర్ ఖేరీ ఘటనలో 5,000 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ రైతుల మారణహోమం ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడని ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి 5,000 పేజీల ఛార్జ్ షీట్‌ను సిట్ సోమవారం దాఖలు చేసింది. పెద్ద ట్రంకు పెట్టెలో తీసుకెళ్లిన ఛార్జ్‌షీట్ పత్రాలను లఖిం పూర్ ఖేరీలోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు సిట్ అధికారులు సమర్పించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. లఖింపూర్ ఉద్రిక్తతలు జరిగిన సమయంలో ఆశిష్ మిశ్రా ఘటనాస్థలంలోనే ఉన్నారని దర్యాప్తులో తేలినట్టు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా బంధువు వీరేంద్ర శుక్లాను కూడా నిందితుడిగా ఛార్జిషీట్లో పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 201 కింద శుక్లాపై అభియోగాలు మోపారు. 'ఛార్జిషీట్‌ను కోర్టు అంగీకరిస్తే, కోర్టు ఇచ్చిన తేదీల్లో విచారణ ప్రారంభమవుతుంది' అని ప్రాసిక్యూషన్ లాయర్ ఎస్పి యాదవ్ చెప్పారు.
అక్టోబరు 3న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులపై ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఇందులో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆశిష్ మిశ్రా ఉద్దేశపూర్వకంగానే రైతులను కారుతో తొక్కించాడంటూ స్థానికులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.
ఈ ఘటనపై అక్టోబర్ 5న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారం తరువాత ఆశిష్ సహా 13 మందిని అరెస్టు చేశారు. ఆశిష్ మిశ్రా, ఇతర వ్యక్తులపై సెక్షన్లు 302 (హత్య), 120-బీ (నేరపూరిత కుట్ర), 279 (ర్యాష్ డ్రైవింగ్), 338 (తీవ్రమైన గాయం), 304-ఏ (నిర్లక్ష్యం వల్ల మరణం), 147 (అల్లర్లు), 149 (చట్టవిరుద్ధమైన సమావేశాలు) కింద నేరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే కేసు విచారణలో జాప్యంపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు జోక్యంతో యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిట్.. ఇటీవల సంచలన విషయాలు వెల్లడించింది. ఇది అనుకోకుండా జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని స్పష్టం చేసింది.
''ఇది నిందితులు చేసిన నిర్లక్ష్యపూరిత చర్య కాదనీ, ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసేందుకు పథకం ప్రకారం చేశారని విచారణలో తేలింది...' అని సిట్ డిసెంబర్ 15న కోర్టుకు నివేదించింది. సిట్ తన దరఖాస్తు ద్వారా ఈ కేసులో 12 మంది నిందితులపై తాజా అభియోగాలను మోపాలని కోరింది.
లఖింపూర్ ఖేరీ హింసాకాండ దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్‌ను సుప్రీం కోర్టు నవంబర్ 17న నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ ఘటనపై విచారణ చేపట్టే సిట్‌ను యూపీ బయట అధికారులతో ఏర్పాటుచేసింది.