Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్భంధంలో మరో మహిళ
ముంబయి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బుల్లీ బై యాప్ కేసులో బెంగళూరుకు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారమే విద్యార్థి విశాల్ ఝాను అరెస్టు చేసి ముంబయికి తీసుకుని వచ్చినట్లు సమాచారం. విద్యార్థిన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళను ఈ కేసులో కీలక నిందితురాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళను కూడా విచారిస్తున్నారు. విశాల్ ఝా ఈ కేసులో సహ నిందితుడని, మహిళే ప్రధాన నిందితురాలని పోలీసులు భావిసున్నారు. అనేక మంది ముస్లిం మహిళలను ఈ యాప్‌లో వేలంలో ఉంచడంతో ఈ వివాదం ఈ నెల 1న వెలుగులోకి వచ్చింది.
ఖండించిన డియుజె
అనేక మంది జర్నలిస్టులతో సహా ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకోవడంపై ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఫోటోలు ప్రచురించడానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ధైర్యమైన మహిళలకు ప్రకటనలో అభినందనలు తెలిపింది. ఈ విషయాన్ని సత్వరమే విచారణ చేయాలని ఫిర్యాదులు నమోదైన ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. బెంగళూరులో ఒక అనుమానితున్ని ముంబయి పోలీసులు గుర్తించారని, కానీ మిగిలిన నిందితుల్ని కూడా తక్షణమే గుర్తించాల్సి అవసరం ఉందని తెలిపింది.అలాగే, ఢిల్లీ పోలీసులతో కేసు నమోదు చేయడంలో ధైర్యం చూపిన వైర్ జర్నలిస్ట్ ఇస్మత్ అరాను అభినందిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ దాడులను ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సభ్యులందరికీ సంఘీభావాన్ని తెలిపింది. లైంగిక వేధింపులను ఎదుర్కొన్న మహిళలందరి బాధను, వారి కుటుంబాల వేదనను పంచుకుంటున్నట్లు ప్రకటనలో డియుజె పేర్కొంది. అలాగే, ముస్లిం మహిళలను ఆన్లైన్ వేలంలో ఉంచడం ఇది రెండోసారని డియుజె గుర్తు చేసింది. ఆరు నెలల క్రితమే ఆన్లైన్లో గుర్తించిన 'సుల్లీ డీల్స్' వెనుక ఉన్న నిందితులను పోలీసులు గుర్తించినట్లయితే, ఈ విధంగా ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేయడం పునరావతం అయి ఉండేది కాదని డియుజె విమర్శించింది.