Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ వ్యాప్తితో పెరుగుతున్న భయాలు
- వీధి వ్యాపారులు, దుకాణాదారులు, రైతుల జీవనోపాధిపై ప్రభావం
న్యూఢిల్లీ : గత రెండేండ్లుగా కోవిడ్ సంక్షోభం సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మూడో వేవ్ ఇప్పుడిప్పుడే మొదలైందన్న సంగతి అనధికారికంగా వెలువడుతోంది. ఈనేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్..తదితర రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలు కఠినంగా మారే అవకాశముంది. లాక్డౌన్ విధిస్తారేమో..! అన్న భయాలు నెలకొన్నాయి. ఇదంతా కూడా వివిధ నగరాల్లో వీధి వ్యాపారులు, దుకాణాదారులు, రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో వ్యాపార సముదాయాలు, దుకాణాలు రాత్రిపూట 9గంటలకల్లా మూసేస్తున్నారు. గత పదిరోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య ప్రతి రోజూ 30శాతం చొప్పున పెరుగుతూ పోతున్నాయి.వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలని మహారాష్ట్రలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు అడిషనల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ వ్యాస్ ఆదేశాలు జారీచేశారు. జనవరి మూడో వారం కల్లా యాక్టీవ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరుకుంటుందని ఉన్నతాధికారులు అంచనావేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఉపాధి సమస్య ఏర్పడుతుందనే భయంతో ఉన్నారు. రవాణా వ్యవస్థ దెబ్బతిని..పంట ఉత్పత్తుల అమ్మకాలు, కూరగాయల ధరలు పడిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ యార్డ్ల్లోనూ హడావిడి ఎక్కువగా కనపడుతోంది. రైతులు తమ పంట ఉత్పత్తుల్ని సాధ్యమైనంత త్వరగా అమ్ముకోవాలని, లాక్డౌన్ విధిస్తే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని మార్కెట్ యార్డుల్లో అధికారులు రైతుల్ని హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మరో మారు లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే మీడియాకు తెలిపారు.