Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ నిబంధనలు గాలికి..
- యూపీ ఎన్నికల ర్యాలీల్లో నాయకుల తీరు
- మాస్కుల్లేకుండానే సభలకు మోడీ, యోగి, కేజ్రీవాల్, అఖిలేశ్
- ప్రజల ప్రాణాలతో చెలగాటం
లక్నో : దేశంలో ఒమిక్రాన్ రోజురోజుకూ విజృంభిస్తూ బేంబేలెత్తిస్తున్నది. కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలే సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉన్నదని థర్డ్‌వేవ్‌పై శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలూ పంపారు. కానీ, సాధారణ సమయాల్లో కరోనా మహమ్మారి మార్గదర్శకాలు తప్పక పాటించాలని ప్రజలకు ఉపన్యాసాలిచ్చే ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు సైతం వాటిని మరిచి ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే సమావేశాలకు మాస్కులు లేకుండానే హాజరవుతున్నారు. కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వెంపర్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే, ఎన్నికల ప్రచారాలతో బిజీగా గడిపిన కేజ్రీవాల్‌కి ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎన్నికల ప్రచారాల్లో ఇప్పుడిది ఆందోళనను కలిగిస్తున్నది.
యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రచారల సభల్లో ఎటు చూసినా కరోనా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మోడీ మొదలుకొని కేంద్ర మంత్రులు, కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్సింగ్ యాదవ్ వరకు ఇలా ప్రతి ఒక్క నాయకుడూ కరోనా మార్గదర్శకాలను లైట్ తీసుకుంటున్నారు.
స్పోర్ట్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం..
మాస్కుల్లేకుండానే మోడీ, యోగి
యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన మాస్కును ధరించకపోవడం గమనార్హం. ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న యోగి కూడా మాస్కు లేకుండానే కనిపించారు. ఈ కార్యమ్రంలో భాగంగా మాస్కు ధరించకుండానే స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ పరికరాలను మోడీ పరిశీలించారు.
మాటలకే పరిమితం..చేతల్లో శూన్యం
దేశంలో ఒమిక్రాన్ వైరస్ ఉధృతితో కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ, మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపర్చుకోవడం వంటి కరోనా మార్గదర్శకాలను పాటించాలని గతనెల 25న చిన్నారులకు కరోనావైరస్ వ్యాక్సిన్ల ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ అభ్యర్థించారు. ఆ తర్వాతి రోజే 'మన్-కీ-బాత్' రేడియో కార్యక్రమంలో భాగంగా ఒమిక్రాన్‌పై పోరుకు 'స్వీయ క్రమశిక్షణ, స్వీయ అవగాహన'కు ఆయన పిలుపునిచ్చారు. అయితే, ప్రజలకు పలు వేదికల్లో సూచనలు చేసిన మోడీ తన వరకు వచ్చేసరికి వాటిని మర్చిపోవడం సరికాదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత గల ప్రధాని స్వయంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని గుర్తు చేస్తున్నారు.
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వని మోడీ
గతేడాది కరోనా సెకండ్‌వేవ్ సమయంలో 'కుంభమేళ' వంటి మతతత్వ కార్యక్రమాలకు అనుమతినివ్వడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ ర్యాలీలు నిర్వహించడం వంటి విషయాలపై మోడీ అప్పట్లో అంతర్జాతీయ మీడియా నుంచి విమర్శలెదుర్కొన్న విషయం విదితమే. అయినప్పటికీ, గత అనుభవాల నుంచి మోడీ పాఠాలు నేర్వలేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. విజయ రథ యాత్రలో భాగంగా లక్నోలో నిర్వహించిన రెండు బహిరంగ సమావేశాల్లో అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. అయితే, అఖిలేశ్‌తో పాటు ఆ సమావేశంలో పాలొన్న చాలా మంది మాస్కులు లేకుండానే దర్శనమిచ్చారు. భౌతిక దూరం సంగతే మరిచారు. గతనెల 23న అఖిలేశ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం విదితమే. ఆదివారం నిర్వహించిన ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆప్ అధినేత కేజ్రీవాల్ పాల్గొన్నారు. కేజ్రీవాల్‌తో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలో అనేక మంది మాస్కుల ధరించలేదు. ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఢిలీల్లో పెరగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ఈ మధ్య కేజ్రీవాల్ తరచూ కోరుతున్నారు. అయితే, యూపీ ఎన్నికల ప్రచార సభల్లో కోవిడ్ మార్గదర్శకాలను ఆయనే పాటించకపోవడం గమనార్హం.
కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్
ఎన్నికల ప్రచారాలతో బిజీగా గడిపిన కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో ఆయన హౌం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. లక్షణాలుండటంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలనీ, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేజ్రీవాల్ కోరారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారాల్లో ఆయన బిజీగా ఉన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఆయా రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలనే చేపట్టారు. ప్రస్తుతం ఆయనే కరోనా బారిన పడటం గమనార్హం.