Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో రైతుల ఆందోళనబాట
న్యూఢిల్లీ : ఎరువుల కొరత, సబ్సిడీల కోతను నిరసిస్తూ తమిళనాడులో రైతులు ఆందోళనబాట పట్టారు. యూరియా, డీఏపీ, పొటాషియం..మొదలైన అత్యంత కీలకమైన ఎరువుల కొరత..ధరలు భారీగా పెరగడానికి దారితీసిందని రైతు సంఘాలు ఆరోపించాయి. లక్షా 43వేల 500 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రాష్ట్రానికి కేటాయించగా, ఇందులో 77వేల 862 మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం సరఫరా చేసిందని, దాంతో అనేక జిల్లాల్లో ఎరువుల కొరత తీవ్రస్థాయిలో నెలకొందని రైతు సంఘాలు ఆరోపించాయి. ఎరువుల తయారీకి సంబంధించి కంపెనీలు ముడి సరుకుల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిపై కేంద్రం భారీమొత్తంలో జీఎస్టీ విధించటం ఎరువుల ధరలు పెరగడానికి దారితీసిందని సమాచారం. మరోవైపు ఎరువుల సబ్సిడీలో భారీ మొత్తంలో కేంద్రం కోతలు విధించింది. ఇదంతా కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికంతటికీ కేంద్రలోని మోడీ సర్కారే కారణమని, ఎరువుల కొరత, అధిక ధరలపై బీజేపీ రైతుల్ని మభ్యపెడుతోందని 'ఆల్ ఇండియా కిసాన్ సభ' (ఏఐకేఎస్) తమిళనాడు రాష్ట్ర శాఖ ఆరోపించింది.''ఎరువులు అందుబాటులో ధరలో ఉండేట్టు చూడటం కేంద్ర ప్రభుత్వం కనీస బాధ్యత. కాంప్లెక్స్ ఎరువుల ధరలన్నీ రూ.300 వరకూ పెరిగాయి. ఇంత జరుగుతున్నా తమది రైతు మేలు కోరే ప్రభుత్వమని బీజేపీ చెప్పుకుంటోంది'' అని ఏఐకేఎస్ కన్యాకుమారి జిల్లా కార్యదర్శి ఆర్.రవి అన్నారు.ప్రస్తుతం తమిళనాడులో 55లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటల్ని రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 20.6లక్షల హెక్టార్లలో వరి, 25.42లక్షల హెక్టార్లలో గింజధాన్యాలు, 3.17లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 3.86లక్షల హెక్టార్లలో వేరుశెనగ, 50వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు పండిస్తున్నారు. ఇందులో వరి, బార్లీ, ఇతర ధాన్యానికి సంబంధించి పంటలకు రైతులు తీవ్రమైన ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారు.