Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధ్వంసం కొనసాగొచ్చు : నిపుణులు
- దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
- ఒక్కరోజే 37 వేలకు పైనే
- 1,892కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- బీహార్‌లో పిల్లలకు కోవాగ్జిన్‌కు బదులు కోవిషీల్డ్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరీ ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కారణంగా చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతూ.. పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యం లో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఉన్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కోవిడ్ కేసులు పెరగడం.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య అధికం కావడంతో ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ టెక్నికల్ అడ్వైసరి గ్రూప్ సభ్యులు అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్‌కు కొత్త వేవ్‌ను కలిగించే సామర్థ్యం ఉందనీ, దీనికి సంబంధించిన కేసులు పెరగడమే నిదర్శనమని అన్నారు. అశోకా విశ్వవిద్యాలయంలోని భౌతిక-జీవశాస్త్ర విభాగం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో కొన్ని వారాల క్రితం నుంచి ఒమిక్రాన్ కేసుల పెరుగుదలను దక్షిణాఫ్రికా, యూరప్ దేశాలతో పొల్చ వచ్చని అన్నారు. డెల్టా కేసులు దేశంలో తగ్గించబడ్డాయి కానీ ఒమిక్రాన్ ప్రమాదంలోకి జారుకుంటున్నామని తెలిపారు. ''కరోనా థర్డ్‌వేవ్ అంచున ఉన్నాం. జనవరి 2న నమోదైన కేసులే నిదర్శనం. రెండు వారల సగటు కంటే 140శాతం కేసులు పెరిగాయి. మరణాలు సైతం 21 శాతం పెరి గాయి'' అని ప్రముఖ వైరాలజిస్ట్, ఇండియా కోవిడ్ నిపుణుల కమిటీ మాజీ చీఫ్ షాహిద్ జమీల్ అన్నారు. దేశంలోని ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మున్ముందు అధికం అవుతుందని ఢిల్లీలోని ఇంద్ర ప్రస్థ అపోలో ఆస్పత్రికి చెందిన ఒక సీనియర్ వైద్య నిపుణులు అన్నారు.
పెరుగుతున్నాయి...
దేశంలో కరోనావైరస్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత దేశంలో కోవిడ్-19 కొత్త కేసులు అధికంగా నమోదవుతు న్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,60,261కు చేరాయి. ప్రస్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు న్నాయి. కొత్తగా 11 వేల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 3,43,06,414కు పెరిగింది. దాదాపు 117 రోజుల తర్వాత అత్యధికంగా ఒకరోజు కోవిడ్ కేసులు ఇవేనని గణాకాంలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్త కరోనా మరణాల సంఖ్య 4,82,071 చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.2శాతం, మరణాల రేటు 1.38శాతంగా ఉంది. కరోనా వారంతపు పాజిటివిటీ రేటు 5.1 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 68,09,50,476 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 8,78,990 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 146.3 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీచేయగా, అందులో రెండు డోసులు తీసుకున్న వారు 61.4 కోట్లు, మొదటి డోసు అందుకున్న వారు 84.9 కోట్ల మంది ఉన్నారు. ఒమిక్రాన్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 1892 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఖరగ్‌పూర్ ఐఐటీలో కరోనా కలకలం
ఖరగ్‌పూర్ ఐఐటీలో కరోనా కలకలం రేపింది. ఇందులోని 60 మందికి కరోనా సోకింది. వీరిలో 40 మంది విద్యార్థులు కాగా, 20 మంది పరిశోధకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. వైరస్ సోకిన వారంతా పలువురు ఇండ్లలో, మరికొందరు క్యాంపస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని ఐఐటీ ఖరగ్‌పూర్ రిజిస్ట్రార్ తమల్‌నాథ్ తెలిపారు.
కొత్త కేసులు 20 వేలు దాటితే లాక్‌డౌనే..!
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి నగర మేయర్ కిషోరీ పడ్నేకర్ కీలక ప్రకటన చేశారు. నగరంలో రోజువారీ కరోనా కేసుల 20వేలు దాటితే లాక్డౌన్ విధిస్తామని స్పష్టంచేశా రు.ప్రజలు సినిమా థియేటర్లు,గార్డెన్లు, మార్కెట్ లకు భారీ సంఖ్యలో వెళ్తుండటం ఇలాగే కొనసాగితే లాక్డౌన్ కంటే ముందే మినీ లాక్డౌన్ కూడా విధించాల్సి వస్తుందని పడ్నేకర్ హెచ్చరించారు.
నలంద మెడికల్ కాలేజీలో 159 మంది వైద్యులకు కరోనా
బీహార్‌లో కరోనా ప్రభావం అధికమవుతోంది. పాట్నాలోని నలందా మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో పని చేస్తున్న 159 మంది వైద్యులకు కరోనా సోకింది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. కరోనా సోకిన వైద్యులకు స్వల్ప లక్షణాలు ఉన్నాయ నీ, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఇటీవల కాలంలో పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సిబ్బందికి సెలవులు రద్దు చేసిన ఎయిమ్స్
దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 80శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తరుణంలో.. ఢిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది. వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూసుకునేందుకు సిబ్బందికి శీతకాలం సెలవుల్ని రద్దు చేసింది. వెంటనే అందరూ విధుల్లో చేరాలని ఆదేశించింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ దేశ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎయిమ్స్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ !
కరోనా కట్టడిలో భాగంగా పంజాబ్ సర్కారు రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. బడులు, కాలేజీలు మూసివేయడంతో పాటు రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా పరిస్థితిపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆంక్షలకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో ప్రత్యక్ష తరగతులు మూసివేయాలని ఆదేశించారు. ఆన్లైన్ క్లాసులు మాత్రం కొనసాగించొచ్చని స్పష్టం చేశారు. అయితే మెడికల్, నర్సింగ్ కాలేజీలు కొనసాగనున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. బార్లు, సినిమా థియేటర్లు, మల్టిపెక్స్‌లు, షాపింగ్ మాల్స్, రెస్టారంట్లు, స్పా సెంటర్లు, మ్యూజియంలు, జూ వంటి ప్రదేశాలను 50శాతం సామర్థ్యంతో నిర్వహించాలని ఆదేశించారు. అయితే, రాజకీయ సమావేశాలు, సభలపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం గమనార్హం.
సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రి పాండేకు కరోనా
సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల వరకు కరోనా ఎవర్నీ వదలడం లేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారినపడ్డారు. కొవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిదనీ, లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. అలాగే, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా వైరస్ సంక్రమించింది.
బీహార్‌లో టీనేజ్ పిల్లకు తప్పుడు టీకాలు.. ఆందోళనలో తల్లిదండ్రులు
ప్రభుత్వం టీనేజ్ పిల్లలకు అంటే 15-18 ఏండ్ల వారికి సోమవారం నుంచి టీకాలు ఇవ్వడం ప్రారంభించింది. వీరికి పెద్దల మాదిరిగా కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్లు కాకుండా కేవలం కోవాగ్జిన్ ఇవ్వాలని డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అయితే, బీహార్‌లో మాత్రం ఇద్దరు పిల్లలకు పొరపాటున కోవాగ్జిన్‌కు బదులుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. తరువాత జరిగిన పొరపాటును గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లలిద్దరిని కొన్ని గంటల పాటు డాక్టర్ల పరిశీలనలో ఉంచారు. టీకా వేసే వ్యక్తికి కరోనా సోకడంతో అతడు సెలవులో ఉన్నాడనీ, కొత్త సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ వేశారని అక్కడి అధికారులు చెప్పారు. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా ప్రభుత్వమే పూర్తి చికిత్స అందిస్తుందని హామీ ఇచ్చారు. అయితే పిల్లలకు కోవిషీల్డ్ టీకా ఇచ్చినప్పటికీ వారికి వచ్చిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో మాత్రం కోవాగ్జిన్ అందించినట్టు నమోదుకావడం గమనార్హం.
ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్ 'ఐహెచ్‌యూ'
కరోనా కొత్త వేరియంట్‌ను దక్షిణ ఫ్రాన్స్‌లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐహెచ్యూగా పేర్కొంటున్న ఈ బి.1.640.2 వేరియంట్‌ను ఇప్పటివరకు 12మందిలో గుర్తించారు. కామెరూన్ దేశానికి వెళ్లిన వారిలో ఇది సోకినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ వేరియంట్ ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని వారు పేర్కొంటున్నారు. ఐహెచ్యూలో 46 మ్యుటేషన్లు, 37 డిలీషన్లు (జన్యు పదార్థం లోపించిన మ్యుటేషన్‌ను డిలీషన్ మ్యుటేషన్ అంటారు) వున్నాయని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఇంకా పూర్తి కావాల్సివుంది. స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లు వున్నాయి. వైరస్ ఈ ప్రొటీన్‌ను ఉపయోగించుకునే కణాల్లోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్ను కలగచేస్తుంది. ఈ వేరియంట్లోని ఎన్501వై, ఇ484కె మ్యుటేషన్లను గతంలో బీటా, గామా, తీటా, ఒమిక్రాన్ వేరియంట్లలోనూ గుర్తించారు. మ్యుటేషన్లు జరుగుతున్న తీరు, వాటి జన్యు స్థితి, వీటన్నింటి ఆధారంగా కొత్త వేరియంట్‌కు ఐహెచ్‌యు అని పేరు పెట్టినట్లు అధ్యయన రచయితలు పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఈ వేరియంట్‌ను ఇంతవరకు గుర్తించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు జరుపుతున్న వేరియంట్లలో కూడా లేదు. గతేడాది నవంబరులో ఒక లేబరేటరీలో చేసిన ఆర్టిపిసిఆర్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినపుడు దీన్ని గుర్తించారు. ఇది కూడా చాలా వేగంగా వ్యాపించడం లేదా గతంలోని రోగనిరోధకతను తప్పించుకుని వచ్చినట్లైతే దీనిని ఆందోళన చెందే వేరియంట్‌గా వర్గీకరించాల్సి వస్తుంది. ఈ కొత్త వేరియంట్ ఏ కేటగిరీలో పడుతుందో చూడాల్సి వుందని అంటువ్యాధుల నిపుణుడు ఫెగిల్ డింగ్ వ్యాఖ్యానించారు.