Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీన్‌దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీలో రేగుతున్న లొల్లి
- వైస్ చాన్సలర్‌ను తొలగించాలంటూ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళన
- ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు
గోరఖ్‌పూర్ : యోగి అదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వివాదాలకు కొదవ లేకుండా పోతుంది. తాజాగా ముఖ్యమంత్రి అదిత్యనాథ్‌కు కీలకమైన గోరఖ్‌పూర్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యారు యూనివర్సిటీ మరో వివాదానికి కేంద్రంగా మారింది. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ రాజేశ్ సింగ్‌పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజేశ్ సింగ్‌ను పదవీ నుంచి తొలగించాలని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు ప్రారంభం ఏమిటంటే.. ఇటీవల వీసీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన నిర్వహించినందుకు హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమలేష్ కుమార్ గుప్తాను సస్పెండ్ చేశారు. ఇతనిపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే గుప్తాకు మద్దతు తెలిపిన ఏడుగురు ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరికి ఒక రోజు జీతం జరిమానా విధించారు. అయితే గుప్తా సస్పెన్షన్ తరువాత నుంచి విసిని తొలగించాలనే డిమాండ్‌తో విద్యార్థులు, అధ్యాపకులు నిరసనలు ప్రారంభించారు. 15 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన దగ్గరనుంచి సింగ్ వివాదాస్పద వ్యక్తిగా మారాడు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని, విశ్వ విద్యాలయం చట్టాలు ధిక్కరిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. అలాగే సరైన పాఠ్యాంశాలు, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేకుండా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందకుండా దాదాపు 60కు పైగా కోర్సులను ప్రవేశపెట్టారని ఆరోపించారు. అదే విధంగా సిబ్బందిని వేధించడం, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.ఈ డీడీయూ విశ్వ విద్యాలయానికి రాక ముందు సింగ్ బీహార్‌లోని పూర్నియాలోని ఒక విశ్వవిద్యాలయానికి వీసీగా ఉన్నారు. అక్కడ కూడా అతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. సింగ్‌పై లోకాయుక్త విచారణ పెండింగ్‌లో ఉంది. అయినా అతన్ని ఈ పదవిలో నియమించడంపైనే విమర్శలు ఉన్నాయి. పదవీలోకి వచ్చిన తరువాత సమావేశాల్లో సిబ్బందిని దూషించడం, విరివిగా నోటీసులు జారీ చేయడంపైనా ఆరోపణలు వచ్చాయి. ఇక సిబ్బందికి నోటీసులు ఇవ్వడంలో అతన్ని మించిన వారు లేరని విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి రిజిస్ట్రార్ ఓంప్రకాష్‌కు సహకరించడం లేదని ఆరోపిస్తూ అతన్ని తొలగించి తాత్కాలిక రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ అజరు సింగ్‌ను వీసీ నియమించడంపై కూడా భారీ వివాదం రేగింది. రిజిస్ట్రార్‌ను తొలగించే అధికారం వీసీకి లేదని చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆర్థిక విభాగాధిపతిని వీసీ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విశ్వవిద్యాలయంలోని హాస్టళ్ల నిర్వహణ, ప్రీ-పీహెచ్డీ విద్యార్థులకు కొత్త పద్ధతిల పరీక్షలను నిర్వహించడం, స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను నిర్వహించకపోవడం... వంటి వాటిపైనా వీసీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే వీసీ ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు చాలా విభిన్నంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయ సిబ్బందికి కూడా వీటి గురించి వివరాలు తెలియవు అంటే పరిస్థితి అర్ధం చేసుకోచ్చు.రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, హడావుడిగా, విధివిధానాలు పాటించకుండానే ఈ కోర్సులను ప్రారంభించారని, విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.అలాగే గత ఆరు నెలల నుంచి విశ్వ విద్యాలయం ఆర్థిక సంక్షోభంలో ఉందని, సిబ్బందికి జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విశ్వ విద్యాలయం సమస్యను యోగి ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.