Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడువేల మందిని బీజేపీ సేకరించలేక
- కేంద్రమంత్రి గడ్కరీ హాజరు వాయిదా..
- వర్చువల్‌గా నిర్వహణ
కాన్పూర్ : కేంద్రంలోనూ, యూపీలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంటే.. డబుల్ ఇంజిన్‌లా అభివృద్ధి దూసుకుపోతుందని కమలంపార్టీ నేతలు అంటున్నారు. కానీ ఆ మాటల్ని అక్కడి ఓటర్లు నమ్మటంలేదు. బీజేపీ నిర్వహించే ఎన్నికల సభలకు జనం రావటానికి ఇష్టపడటంలేదు. కాన్పూర్‌లో నిర్వహించాల్సిన సభకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరుకావాల్సి ఉన్నది. కానీ ఆ సభకు మూడువేల మంది కూడా రాకపోవటంతో.. ఆయన పర్యటను రద్దు చేసుకుని.. లక్నోనుంచి వర్చువల్ కార్యక్రమంతో సరిపెట్టుకోకతప్పలేదు.
ఏం జరిగిందంటే..
బుధవారం కాన్పూర్‌లో గడ్కరీ నేతృత్వంలో ఎన్నికల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా హాజరుకావాల్సి ఉన్నది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా నితిన్ గడ్కరీ నేరుగా లక్నో బయలుదేరారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనాలను సమీకరించలేకపోవటంతో బీజేపీ ఆఫీస్ బేరర్లు గుక్కతిప్పుకోలేకపోయారు. లక్నోలో కార్యక్రమం ప్రారంభమైనప్పుడు అక్కడ 500 మంది కూడా లేరు.
డిప్యూటీ సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కొద్ది మంది మాత్రమే కనిపించారు. చివరికి పరువు కాపాడేందుకు వేసిన కుర్చీలను తొలగించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని అంచనావేశారు. 11 గంటల వరకు 2 వేల మంది కూడా రాకపోవడంతో షామియానాలో వేసిన కుర్చీలను తొలగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇటు జనాన్ని తరలించపోవటంపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్ల మధ్య గొడవ జరిగింది. జనం లేని సభకు వెళ్లటం కన్నా.. మమ అనిపిస్తే సరే అన్నట్టుగా నితిన్ గడ్కరీ వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీజేపీ సభలో ఖాళీగా ఉన్న కుర్చీలను..వాటిని తొలగించిన వీడియోను సమాజ్ వాదీ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేసింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు పోస్టులతో హల్చల్ చేస్తున్నాయి.
కోవిడ్ నిబంధనల్లేవ్..
కాన్పూర్‌లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ, కార్యక్రమంలో ఎక్కడా కరోనా నియమాలు పాటించినట్టు కనిపించలేదు.ఎమ్మెల్యేలు, ఎంపీ లు మాస్కులు,సామాజిక దూరం లేకుండానే వేదికపై కూర్చున్నారు. వేదిక వద్దకు తరలించిన జనానికి మాస్కులు,శానిటైజర్లు కూడా పంపిణీ చేయలేదు.
అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలే...
ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి పట్టించుకోని బీజేపీ ఇపుడు యూపీలో శిలాఫలకాల మోత పుట్టిస్తున్నది. అటు మోడీ, ఇటు కేంద్రమంత్రులు ఎక్కడబడితే అక్కడ కొత్త ప్రాజెక్టులంటూ ఓటు రాజకీయం మొదలుపెట్టింది. తాజాగా 14 వేల 429 కోట్ల విలువైన పథకాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేసి బటన్ నొక్కారు. మీరెన్ని నాటకాలు వేసినా ఓటు అనే ఆయుధంతో..మీ అంతు చూస్తాననేలా ఓటరు కాచుకుని కుర్చున్నాడు.