Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల నుంచి నిరసన సెగ
- రహదారిని దిగ్బంధించిన అన్నదాతలు
- ఫ్లైఓవర్‌పై చిక్కుకున్న ప్రధాని
- 20 నిమిషాల పాటు అక్కడే నిలిచిన కాన్వారు
- పర్యటన వాయిదా వేసుకొని వెనుదిరిగిన మోడీ
చండీగఢ్ : పంజాబ్‌లో ప్రధాని మోడీకి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ముందుగా నిర్దేశించినట్టు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి రోడ్డు మార్గం గుండా వెళ్తున్న మోడీ కాన్వారుకి అన్నదాతల ఆందోళనతో బ్రేక్ పడింది. మోడీ వెళ్లే దారిలోని రహదారిని రైతులు దిగ్బంధించారు. దీంతో మోడీ వాహనశ్రేణి ఫ్లైఓవర్‌పై నిలిచింది. దాదాపు 20 నిమిషాల పాటు మోడీ ఫ్లైఓవర్ పైనే ఉండాల్సి వచ్చింది. దీంతో ఎస్పీజీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రధాని ఉన్న వాహనానికి భద్రతను కల్పించింది. అయితే, రహదారిని దిగ్బంధించిన రైతులు ఎంతకూ వెనక్కి తగ్గలేదు. దీంతో రహదారి క్లియర్ కాకపోవడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకొని వెనుదిరిగారు.
ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేనీవాలాలో గల అమరవీరుల స్థూపాన్ని సందర్శించడానికి మోడీ బఠిండాకు చేరుకున్నారు. అక్కడ నుంచి హుస్సేనీవాలాకు మోడీ హెలికాప్టర్ ద్వారా వెళ్లాల్సి ఉన్నది. అయితే, వర్షం కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించారు. తప్పనిసరి భద్రతాపరమైన ఏర్పాట్లకు సంబంధించి పంజాబ్ డీజీపీ నుంచి ధ్రువీకరణ వచ్చిన తర్వాత రోడ్డు ప్రయాణం ద్వారా వెళ్లాలని ఆయన (మోడీ) ముందుకు సాగినట్టు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తెలిపింది. అయితే, గమ్యస్థానానికి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫ్లైఓవర్ వద్దకు ప్రధాని కాన్వారు రాగానే.. నిరసనకారులు చుట్టుముట్టారని వివరించింది. కనీసం 15-20 నిమిషాల పాటు మోడీ ఫ్లైఓవర్‌పై చిక్కుకున్నారని తెలిపింది. కాగా, హుస్సేనీవాలా కార్యక్రమం అనంతరం ఫిరోజ్‌పూర్ ర్యాలీలోనూ మోడీ పాల్గొనాల్సి ఉన్నది. అయితే, అది కూడా రద్దయ్యింది.
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆగ్రహం
కాగా, ఈ విషయంలో కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం కనబడిందని లేఖలో పేర్కొన్నది. ఇదంతా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఎంహెచ్ఏ ఆరోపించింది. రోడ్డు పర్యటన ద్వారా వెళ్తున్న ప్రధానికి అదనపు భద్రతను పంజాబ్ ప్రభుత్వం కల్పించలేదని వివరించింది. ఒక ప్రధాన మంత్రి పర్యటనలో జరిగిన అదిపెద్ద భద్రతా వైఫల్యం ఇదేనని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదికను కోరింది. భద్రతా లోపానికి బాధ్యత వహించాలనీ, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఆరోపణలను తోసిపుచ్చిన పంజాబ్ సీఎం
అయితే, పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. హెలికాప్టర్లో గమ్యస్థానానికి వెళ్లాల్సిన మోడీ పర్యటన చివరి నిమిషంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ ఛన్నీ అన్నారు.
'అప్పుడు రైతులను మోడీ అడ్డుకున్నారు...'
కాగా, మోడీ పర్యటనకు రైతుల నిరసన సెగ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద సాగు చట్టాలపై నిరసనలు చేస్తున్న రైతుల పట్ల మోడీ సర్కారు అప్పట్లో వ్యవహరించిన తీరును నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పోస్టులు చేస్తున్నారు. 'బారీకేడ్లు, ఫెన్సింగ్ వంటి సహాయంతో రైతులను అడ్డుకోవడానికి కేంద్రం ప్రయత్నించింది. ఇప్పుడు మోడీని రైతులు అడ్డుకున్నారు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.