Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు సమావేశం
- పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించడం కోసం సీఎం పిలుపు
చెన్నై : ప్రతిష్టాత్మక జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి తమిళనాడును మినహాయించే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ గురించి చర్చించడానికి ఈనెల 8న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు స్టాలిన్ తెలిపారు. నీట్ విషయంపై చర్చించడానికి డీఎంకే నేత టీఆర్ బాలు నేతృత్వంలోని అన్ని పార్టీల ఎంపీలతో కూడిన బృందం కేంద్రం హౌం మంత్రి అమిత్ షాను బుధవారం కలుసుకోలేకపోయిందని సీఎం చెప్పారు. నీట్ నుంచి రాష్ట్రాన్ని మినహాయించే తమిళనాడు బిల్లుపై కేంద్రం ఏ చర్య కూడా తీసుకోలేదని వివరించారు. రాష్ట్రంలో అడ్మిషన్ల కోసం ప్రవేశపరీక్షను రద్దు చేస్తూ తమిళనాడు అసెంబ్లీ గత సెప్టెంబర్‌లో ఈ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మాత్రం ఇప్పటికీ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకపోవడం గమనార్హం.
నీట్‌కు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని స్టాలిన్ రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రయోజనాలకు నీట్ వ్యతిరేకమని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష మెడికల్ అడ్మిషన్లను నిర్వహించే విధానాన్ని నిర్ణయించే రాష్ట్రాల హక్కును హరిస్తుందన్నారు. ఈ విషయంపై తమ పార్టీ ఎంపీలతో కలవడానికి అమిత్ షా నిరాకరించారనీ, అలా చేయడమనేది '' ప్రజాస్వామ్య వ్యతిరేకం'' అని స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నీట్‌పై తమిళనాడు వ్యతిరేకత
నీట్ విషయంలో తమిళనాడు ఎప్పటి నుంచో వ్యతిరేకతతో ఉన్నది. నీట్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తన సిలబస్ ఆధారంగా రూపొందిస్తుంది. ఇది తమిళనాడు బోర్డు సిలబస్‌తో పోలిస్తే చాలా తేడా ఉంటుందన్నది వాదన. ఈ కారణంతోనే తమిళనాడు.. నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నది. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది స్టేట్ బోర్డు స్టూడెంట్స్ అవకాశాలను దెబ్బతీస్తుందని వాదిస్తున్నది. విద్యార్థులకు 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరపాలని స్టాలిన్ సర్కారు కోరుతున్నది. కాగా, తమిళనాడు ప్రజలు నీట్‌ను కోరకుంటున్నారనీ, డీఎంకే నే వద్దంటున్నదని బీజేపీ ఆరోపించింది.