Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరోసారి విరుచుకుపడుతున్నది. ఒక్కరోజులోనే 90వేలకు పైగా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు కంటే 56 శాతం అధికంగా కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 90,928 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసులు 3.51 కోట్లకు చేరాయి. గతేడాది జూన్ నెలలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 26 వేలు, పశ్చిమ బెంగాల్లో 14 వేలు, ఢిల్లీలో 10 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 2,630కి చేరాయి. బుధవారం కొత్తగా 495 మందికి ఈ వేరియంట్ సోకింది. 26 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 797 మందికి ఈ కొత్త వేరియంట్ సోకగా, ఢిల్లీలో ఆ సంఖ్య 465కి పెరిగింది. అలాగే 24 గంటల్లో 325 మంది కరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరింది.
కేంద్రం ఆదేశాలు
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి ఊహించని రీతిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. విస్తృత వేగం, అధిక ప్రాబల్యం కలిగిన ఈ వేరియంట్ వ్యాప్తితో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. ముఖ్యంగా 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని కోరింది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు చేపట్టాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు మరోసారి లేఖ రాసింది.
తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయా, జమ్మూ, కశ్మీర్‌తో పాటు బీహార్ రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షలు తక్కువ చేయడం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఓవైపు కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతున్నా టెస్టుల సంఖ్య పెంచకపోవడం పట్ల అసంతప్తి వ్యక్తం చేసింది. ఆశించిన స్థాయిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోతే వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వైరస్ విజంభణ ప్రారంభ దశలోనే దీనికి అడ్డుకట్ట వేయాలంటే కొవిడ్ టెస్టులను భారీగా పెంచాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం కావాల్సిన టెస్టు కిట్లను, పరీక్షా కేంద్రాలు, అవసరమైన పరికరాల లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని తొమ్మిది రాష్ట్రాలకు సూచించారు.
ఇటలీ నుండి వచ్చిన విమానంలో 125 మందికి కరోనా
ఇటలీ నుండి వచ్చిన ఓ విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్ తేలటం కలకలం రేపుతోంది. మిలాన్ నుంచి 170 మందికి పైగా ప్రయాణీకులతో కూడిన విమానం పంజాబ్‌లోని అమత్సర్కు చేరుకోగా.. అనంతరం చేపట్టిన పరీక్షల్లో ఈ పెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూశాయని విమానాశ్రయం డైరెక్టర్ వికె సేథ్ తెలిపారు. కరోనా నిర్ధారణైన ప్రయాణీకులను క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హౌమ్
దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. రెండు రోజులుగా కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో ఐటీ సంస్థలు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హౌమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన అనంతరం కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు హాజరుకావాల్సిందిగా ఆదేశించాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ ముప్పు పెరుగుతుండటంతో ఆయా సంస్థలు మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని నోటీసులు జారీ చేశాయి. సోమవారం నుండి కొన్ని ఐటి కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా, మరికొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు బుధవారం నుంచి ఈ విధానాన్ని సూచించినట్టు తెలుస్తున్నది.
ఐటీ సంస్థలే కాకుండా దేశంలోని ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు కూడా ఉద్యోగుల భద్రత దృష్ట్యా వర్క్ ఫ్రం హౌం విధానానికే మొగ్గుచూపుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన పలు వ్యాపార సంస్థలు కూడా ఈ దిశగా చర్యలను తీసుకుంటున్నాయి. ఉద్యోగులు కూడా కరోనా భయంతో ఆఫీసులకు రావడానికి జంకుతున్నారని పలు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.