Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం) కర్నాటక మహాసభలో బి.వి.రాఘవులు పిలుపు
- 34 మందితో కొత్త కమిటీ
బెంగళూరు : దక్షిణాదిలో బీజేపీ మరింత విస్తరించకుండా ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. కొప్పాల జిల్లా గంగావతిలో సీపీఐ(ఎం) కర్నాటక రాష్ట్ర 23వ మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఆ సభలో రాఘవులు మాట్లాడుతూ, దక్షిణాదిన బీజేపీ విస్తరించకుండా ఆపాలంటే ముందుగా కర్నాటకలో బీజేపీని అడ్డుకోవాలని అన్నారు. స్థానికంగా నయా ఉదారవాదం ప్రభావాలపై నిర్దిష్టంగా అధ్యయనం చేయాలని కోరారు. రోజువారీ జీవనంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగించాలని అన్నారు. రాజకీయ సైద్ధాంతిక ప్రచారంతోనే మతోన్మాదంపై పోరు సల్పలేమని చెప్పారు. సుసంపన్నమైన సాంస్కృతిక సాంప్రదాయాలను, కళలను, వారసత్వాన్ని ఉపయోగించుకోవడం ద్వారా స్థానిక స్థాయిలో సాంస్కృతిక జోక్యం ద్వారా పోరాడాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రతీ ప్రజా సంఘానికి కచ్చితంగా ఒక సాంస్కృతిక శాఖ వుండాలని, ఆ శాఖ ప్రజల జీవితాల్లో నిరంతరంగా చొచ్చుకునిపోయేలా పనిచేయాలని అన్నారు. ప్రతి సమావేశంలోనూ, సభల్లోనూ తప్పనిసరిగా సాంస్కృతిక కళా రూపాలు వుండాలన్నారు. యువతను కూడా ఈ ఉద్యమం వైపునకు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని, ఈ హిందూ సమాజంలోని కుల వివక్ష, అంటరానితరం వంటి సామాజిక అణచివేతలపై పోరు సల్పాలని కోరారు. సంఘపరివార్ జరుపుతున్న మతోన్మాద దాడులను ప్రతి ప్రజా సంఘం కలిసికట్టుగా ఎదుర్కొనాల్సిన అవసరం వుందని రాఘవులు పేర్కొన్నారు.
ఈ మహాసభలకు 24 జిల్లాల నుంచి 246మంది ప్రతినిధులు, 47మంది పరిశీలకులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి యు.బసవరాజ్ కార్యదర్శి నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఆ నివేదికపై 74మంది ప్రతినిధులు దాదాపు 8గంటల పాటు చర్చించారు. ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు కార్యదర్శి సమాధానం చెప్పిన తర్వాత నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. 36 తీర్మానాలను మహాసభ ఆమోదించింది.
12 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం
34మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని మహాసభ ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ బసవరాజ్‌ను తిరిగి కార్యదర్శిగా, 12మందితో రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని ఎన్నుకుంది. దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో సేవలందించిన అనంతరం రాష్ట్ర కమిటీ నుంచి వైదొలగిన నేతలు వి.జె.కె.నాయర్, జి.ఎన్.నాగరాజ్, నిత్యానంద స్వామి, కె.శంకర్లను మహాసభలో సన్మానించారు.