Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారణాసి ఘాట్ల వద్ద పోస్టర్ల కలకలం
- ఇక్కడ నుంచి దూరంగా ఉండాలంటూ హిందూత్వ శక్తుల హెచ్చరికలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హిందూత్వ శక్తుల చర్యలు అలజడిని సృష్టిస్తున్నాయి. హిందూయేతరులను హెచ్చరిస్తూ వారణాసి ఘాట్ల వద్ద పోస్టర్లు వెలిశాయి. వారణాసి ఘాట్ల వద్ద హిందూయే తరులకు ప్రవేశం లేదనీ, ఇక్కడ ఉంచి దూరంగా ఉండాలంటూ హిందూత్వ శక్తులు అందులో హెచ్చరించాయి. విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్ కాశీ ల పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. '' గంగా, వారణాసి ఘాట్లు, ఆలయాలు సనాతన ధర్మానికి, భారత సంస్కృతికి, మన విశ్వాసానికి చిహ్నాలు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారికే ఘాట్ల వద్దకు అనుమతి ఉన్నది. ఇవి పిక్నిక్ కేంద్రాలు కావు'' అని పోస్టర్లలో ఉన్నది. అయితే, ఈ పోస్టర్లలో ఉన్నవి అభ్యర్థన కాదనీ, ఇది ఒక 'హెచ్చరిక' అని భజరంగ్‌దళ్ వారణాసి కన్వినర్ నిఖిల్ త్రిపాఠి రుద్ర మీడియాతో మాట్లాడుతూ వెల్లడించడం గమనార్హం.
తనకు చెందిన గ్రూపే ఈ చర్యకు దిగిందని తెలిపారు. తమ హెచ్చరికలను కాదని ఘాట్లను పిక్నిక్ స్పాట్‌గా వినియోగిస్తే నిరసన ప్రదర్శనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. వారిని పోలీసులకు పట్టిస్తామని చెప్పారు. ఇతర మతాలకు చెందినవారికి ఇక్కడేం పని? అని విశ్వ హిందూ పరిషద్‌కు చెం దిన రాజన్ గుప్తా మీడియాతో అన్నారు. కాగా, పోస్టర్లకు సంబంధించిన విష యం తెలియగానే పోలీసులు వాటిని తొలగించారు. గతేడాది నుంచే యూపీలో హిందూత్వ శక్తులు మరింత యాక్టివ్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు వివరించారు. అయితే, కొన్ని నెలల్లోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మళ్లీ మతం పేరుతో అధికారంలోకి రావడంలో భాగంగా అధికార బీజేపీ, దాని అనుబంధ హిందూత్వ శక్తులు ఇలాంటి కుటిల యత్నాలకు దిగుతున్నాయని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. సాక్షాత్తూ ప్రధాని మోడీ నియోజకవర్గం లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.