Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని ట్రావెల్ రికార్డులను సేకరించండి : పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశం
- విచారణ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనపై భద్రతా లోపం ఎక్కడుందో తేలాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను సేకరించి, భద్రపరచాలని పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను సేకరించడంలో రిజిస్ట్రార్ జనరల్‌కు అవసరమైన సాయాన్ని అందించాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను, ఎస్పీజీ, ఇతర కేంద్ర సంస్థలను ఆదేశించింది. పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని భద్రతా వైఫల్యంపై కూలంకషంగా దర్యాప్తు జరపాలని కోరుతూ లాయర్స్ వాయిస్ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
దర్యాప్తు నిమిత్తం కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలను తాత్కాలికంగా విచారణ నిలిపివేయాల్సిందిగా బెంచ్ కోరింది. ఈ అంశంపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ముందుగా రికార్డులన్నీ భద్రంగా సేకరించాలని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది సోమవారం కోర్టు నిర్ణయిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
శనివారం కల్లా సమాధానం కావాలి : భటిండా ఎస్ఎస్పీకి కేంద్రం షోకాజ్ నోటీసు
భటిండా సీనియర్ ఎస్పీకి కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. శనివారం సాయంత్రం 5గంటలకల్లా దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా కోరింది. ఆలిండియా సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్), రూల్స్, 1969 కింద క్రమశిక్షణా చర్యలెందుకు తీసుకోరాదో తెలియజేయాల్సిందిగా ఆ నోటీసులో కోరారు.
మోడీ కారుకు దగ్గరగా వెళ్లి నినాదాలిచ్చింది బీజేపీవారే : రైతులు
ప్రధాని మోడీ కారుకు కొద్ది మీటర్ల దూరంలో హైవేకి రెండో పక్కన గుంపుగా వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీ పతాకాన్ని చేబూని 'బీజేపీ జిందాబాద్' అంటూ నినాదాలు ఇవ్వడం వీడియోలో స్పష్టంగా అగుపించింది. ఈలోగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది కవచంలా ఏర్పడడంతో ఆ కారు అక్కడ నుంచి వెళ్లిపోయింది. తమ ఇబ్బందులను చెప్పుకోవడానికి తాము ప్రధానికి దగ్గరగా వెళ్లాల్సి వుండగా, తమకన్నా ముందే బీజేపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారని రైతులు తెలిపారు. ప్రధాని కాన్వారుకి కిలో మీటరు దూరంలో రైతుల ఆందోళన జరుగుతున్నది.
కేంద్ర బృందం విచారణ
భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కోసం కేంద్రం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ శుక్రవారం ఫిరోజ్‌పూర్‌కు చేరుకుంది. ప్రధాని కాన్వారు నిలిచిపోయిన ఫ్లైఓవర్ దగ్గరకు వెళ్లి 40నిముషాల సేపు పరిశీలించింది. అనంతరం బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్ చేరుకుని అక్కడ సీనియర్ పౌర, పోలీసు అధికారులతో మాట్లాడి విషయాలు సేకరించింది.