Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలస కార్మికులకు లాక్డౌన్ భయం
- సొంతూర్ల బాట... కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్లు
- ముంబయిలో విరుచుకుపడ్డ ఖాకీలు
- ఇక్కడే ఉండి ఆకలితో చచ్చిపోతాం : శ్రామిక జనం
భారత్‌లో కరోనా జడలు విప్పుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ ప్రజలు, మరీ ముఖ్యంగా వలసకార్మికుల, పేద, మధ్య తరగతి ప్రజలు లాక్డౌన్ కష్టాల బారిన పడ్డారు. ప్రస్తుతం రాత్రివేళల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తే.. ఎప్పుడైనా లాక్డౌన్ ప్రకటించే అవకాశాలున్నట్టు వస్తున్న సూచనలు వలసబతుకుల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయి. దీంతో మళ్లీ వలసకార్మికులు మళ్లీ సొంతూర్ల బాటపడుతున్నారు. దేశంలోని మహానగరాలైన ఢిల్లీ, ముంబయిలతో పాటు యూపీ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో శ్రామికజనానికి గత కష్టాలు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే ఆయా నగరాల్లోని రైల్వేస్టేషన్లు, బస్సుప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భారీ సంఖ్యలో చేరుకుంటున్న వలసకూలీలను నియంత్రించటానికి పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. తాజాగా ముంబయిలోని రైల్వేస్టేషన్‌కు వచ్చిన వారిపై ఖాకీలు లాఠీలు ఝుళిపించారు. దెబ్బలు తగిలినా సరే.. సొంతూర్లకు వెళ్లటానికి స్టేషన్ల ముందు పడిగాపులు పడుతున్నారు.
న్యూఢిల్లీ : కరోనా మొదటి వేవ్‌లో మోడీ అకస్మా త్తుగా తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం తర్వాత మహా నగరాల నుంచి సొంతూర్లకు వెళ్లటానికి వలసదారుల హృదయాలను కదిలించే చిత్రాలను మనమంతా చూశాం. సొంతూర్లకు కాలిబాటన బయలుదేరి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలూ ఉన్నాయి. తాజాగా కొత్తవేరియంట్ రూపంలో థర్డ్‌వేవ్ వేగంగా విస్తరిస్తుం డటంతో.. నాటి దృశ్యం మరోసారి కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు ముంబయిలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌కు చేరారు. యూపీ, బీహార్‌కు వెళ్లే చాలా రైళ్లు ఇక్కడి నుంచే బయ లుదేరుతాయి. ముంబయికి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన వారంతా యూపీ, బీహార్‌కు చెందిన వారే ఉన్నారు. రైల్వే స్టేషన్లో వల సదారుల్ని నియంత్రించటానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. సొంతూర్లకు వెళ్లటానికి రైలు టిక్కెట్ కూడా లభించలేదు. దీంతో వారంతా అక్కడి నుంచి కదలటం లేదు. ముం బయిలో లాక్డౌన్ పెడితే.. తామంతా ఆకలితో చనిపోతామని ఆందోళన చెందుతున్నారు. అందుకే లాక్‌డౌన్‌కు ముందే తమ ఊళ్లకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ముంబయిలో గత 24 గంటల్లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ భయంతో వలస కూలీలు, ముఖ్యంగా కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గురువారం రాత్రి నుంచే ముంబయి కుర్లాలోని లోకమాన్య తిలక్ స్టేషన్లో వలసదారులు గుమిగూడటం ప్రారంభించారు. అమాంతంగా రద్దీ పెరిగింది. లాక్డౌన్ భయంతో జనం ఒకరోజు ముందుగానే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌కు చేరుకున్న శ్రామిక వర్గ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లాక్డౌన్ పెడితే ఏం చేయాలి..? ఎలా బతకాలి..? అనే దానిపైనే చర్చ. ఇలా లాక్డౌన్ భయంతో వలస కూలీలు రైల్వే స్టేషన్లో బారులు తీరారు. తలపై సరుకులు పెట్టుకుని స్టేషన్‌కు చేరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
స్టేషన్ వద్దకు వలసకుటుంబాలు రాగానే పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. లాఠీ బలాన్ని వారికి చూపించారు. 'నువ్వు పారి పోవటానికి వస్తే బీహార్-యూపీ నుంచి ఎందుకు వస్తావు?' అంటూ బాదారు. దెబ్బలకు తాళలేక నిస్సహాయులైన కూలీలు స్టేషన్ ముందు బైటాయించారు. చాలా మందికి రైల్వే స్టేషన్లో టిక్కెట్లు లేవు.. అయినా రైలు ఎక్కేం దుకు సిద్ధమయ్యారు. రాత్రంతా ఆకలి, దాహంతో స్టేషన్ బయట గడిపారు. రాత్రి గడిచేకొద్దీ, లోకమాన్య తిలక్ స్టేషన్ వెలుపల వందలాది మంది యూపీ-బీహార్‌కు చెందిన వలసకార్మికులు లాక్డౌన్ భయాందోళనతో చేరుకోవటం ఎక్కువైంది. అందరి మాటల్లోనూ, మొహాల్లోనూ, కండ్లలో నూ ఒకే ఒక్క ప్రశ్న - ఇంటికి ఎప్పుడు చేరుకుం టావు? ఎలా చేరుకుంటావు? అనే ఆత్రుత కనిపించింది. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు.. అందర్ని ప్లాట్‌ఫారమ్ మీదకు వెళ్లడానికి అను మతించారు. కార్మికులు లోపలికి చేరుకోగానే గందరగోళం నెలకొన్నది. అందరూ జనరల్ కంపార్ట్మెంట్ కోసం వెతుకుతూ.. అటు ఇటు పరిగెత్తారు. స్టేషన్ బయట, లోపల ఎలాంటి స్కానింగ్ కూడా లేదు. భౌతిక దూరమూ కనిపించ లేదు. చాలా మంది మాస్కులు కూడా ధరించలేదు. టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కారు. నిమిషాల వ్యవధిలోనే జనరల్ కంపార్ట్మెంట్ నిండిపోయింది. ముందు ఇక్కడ నుంచి సొంతూర్లకు వెళితే..అదే చాలు అన్నట్టుగా వలసకార్మికులు భావిస్తున్నారు.