Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ : వైవాహిక లైంగికదాడి అనేది ఇప్పటికే భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద క్రూరత్వ నేరంగా ఉన్నదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏదైనా కొత్త నేరాన్ని చట్టం చేసే అధికారం కోర్టులకు లేదనీ తెలిపింది. '' వైవాహిక లైంగికదాడి అనేది భారత్లో క్రూరమైన నేరం. ప్రతి ఒక్క చట్టం కింద వివాహిత మహిళలు, వివాహం కాని మహిళలు వేర్వేరుగా ఉంటారు '' అని ఢిల్లీ ప్రభుత్వం తరఫు లాయర్ నందిత రావు హైకోర్టుకు తెలిపారు. వైవాహిక లైంగికదాడిని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతున్నది. పిటిషనర్లలో ఒకరి కేసులో ఐపీసీలోని సెక్షన్ 498(ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా లాయర్ ఉటంకించారు. వివాహిత మహిళపై భర్త, అతని కుటుంబ సభ్యుల క్రూరత్వం గురించి ఈ సెక్షన్ చర్చిస్తుంది. అయితే, భారత్లో వైవాహిక లైంగికదాడి గురించి మాత్రం ఏ చట్టంలోనూ నిర్వచించబడలేదు. దీనిపై రిట్ ఫౌండేషన్, ఐద్వా వంటి ఎన్జీవోలు, సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. కాగా, ఈ అంశంపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 10న చేపట్టనున్నది.