Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
- కాంగ్రెస్‌కు పంజాబ్.. బీజేపీకి యూపీ కీలకం
- ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ నాయకత్వానికి పరీక్ష
న్యూఢిల్లీ : భారత్‌ను కోవిడ్ సంక్షోభం చుట్టుముట్టినవేళ ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలే ఉన్నాయి. ఒక్క పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇందులోనూ ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో వచ్చే ఫలితాలు మోడీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గరిష్ట స్థానాలు కైవసం చేసుకోవటం పాలకులకు సులభంగా మారుతుందని ఆయా పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న 52మంది ఎంపీల్లో 11మంది పంజాబ్ నుంచే ఎన్నికయ్యారు. యూపీ నుంచి బీజేపీకి 71మంది ఎంపీ సభ్యులున్నారు. ఇరు పార్టీల (కాంగ్రెస్, బీజేపీ) ఎంపీల్లో దాదాపు 20శాతం మంది ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచి ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ (ఎస్పీ) పుంజుకున్నట్టు కనపడుతోంది. అఖిలేశ్ యాదవ్ సభలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. నిరుద్యోగం, అధిక ధరలు, ఇంధన ధరల పెంపు నేపథ్యంలో అధికార బీజేపీపై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనపడుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభావం ఉంటుంది. మోడీ సర్కార్ రాజకీయాలు పంజాబీలకు బాగా తెలుసునని, ఆప్‌ను ఆదరిస్తారని ఆ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ బలంగా నమ్ముతున్నారు.
మత రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ
పంజాబ్‌లో బీజేపీ చేసే పోరాటమంతా కేవలం అస్తిత్వం నిలుపుకోవటం కోసమే అని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ఉంది. పంజాబ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న రైతులు మోడీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మూడు సాగు చట్టాల్ని రద్దు చేయాలన్న పోరాటం ఢిల్లీ శివార్లలో ఏడాదిపాటు సాగింది. రైతుల సమస్యలు వినడానికి ప్రధాని మోడీ ఏనాడూ సుముఖత వ్యక్తం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వివాదాస్పద సాగు చట్టాల్ని ఎందుకు రద్దు చేశారో అందరికీ తెలిసిందే. ఈ చట్టాల్ని మళ్లీ మరో రూపంలో బీజేపీ తీసుకువస్తుందనే అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. దాంతో మతాన్ని అడ్డుపెట్టుకొని సిక్కులను తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్‌లోని సిక్కుల ప్రార్థనా మందిరాల సందర్శనను సులభతరం చేశామని బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేసింది.
పార్టీ నాయకత్వానికి సవాల్!
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ హిందూత్వ రాజకీయాలు ప్రధాని మోడీని బాగా ఆకర్షించాయి. హిందూత్వ రాజకీయాలకు నాయకుడిగా నిలబడాలన్న తాపత్రయం యోగి ఆదిత్యనాథ్‌లో ఎక్కువగా కనపడింది. యోగి పాలనపై ఓటర్లలో సుముఖత లేదు. పాలనలో తనదైన ముద్ర వేయలేకపోయారు. ఒకానొక స్థాయిలో యోగిని తప్పించాలని పార్టీ నాయకులే అమిత్ షా, ప్రధాని మోడీకి మొరపెట్టుకున్నారు. దాంతో యోగిని పలుమార్లు ఢిల్లీకి పిలిపించి దిశానిర్దేశం చేయాల్సి వచ్చింది.