Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు
- మొత్తం 7 దశల్లో పోలింగ్
- మార్చి 10న ఫలితాలు
- యూపీలో ఏడు దశల్లో..
- మణిపూర్లో రెండు దశల్లో..
- పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే దశలో..
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ మేరకు శనివారం నాడిక్కడ విజ్ఞాన్ భవన్ లో ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సుశీల్ చంద్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసన సభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ జరపనున్నట్టు తెలిపారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరిపి, ఫలితాలు వెల్లడించనున్నట్టు చెప్పారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో పూర్తవుతుంది.
యూపీలో ఏడు దశలు, మణిపూర్ లో రెండు దశలు
403 శాసనసభ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 10న తొలి విడత (11 జిల్లాల్లో 58 నియోజకవర్గాలు) పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 14న రెండో దశ (9 జిల్లాల్లో 55 నియోజకవర్గాలు), ఫిబ్రవరి 20న మూడో దశ (16 జిల్లాల్లో 59 నియోజకవర్గాలు), ఫిబ్రవరి 23న నాలుగో దశ (9 జిల్లాల్లో 60 నియోజకవర్గాలు), ఫిబ్రవరి 27న ఐదో దశ (11 జిల్లాల్లో 60 నియోజకవర్గాలు), మార్చి 3న ఆరో దశ (10 జిల్లాల్లో 57 నియోజకవర్గాలు), మార్చి 7న ఏడో దశ (9 జిల్లాల్లో 54 నియోజకవర్గాలు) ఓటింగ్ నిర్వహించనున్నారు. మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 27 (6 జిల్లాల్లో 38 నియోజకవర్గాలు) తొలిదశ, మార్చి 3న రెండు దశ (10 జిల్లాల్లో 22 నియోజకవర్గాలు)లో ఎన్నికలు జరగనున్నాయి.
పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే దశలో ఎన్నికలు
117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్, 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్, 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
పోలింగ్ సమయం గంట, పోలింగ్ కేంద్రాలు 16 శాతం పెంపు
కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలుగా మారిందని, దీనిపై ప్రభుత్వంతో పాటు నిపుణులతోనూ చర్చించామని అన్నారు. కరోనా పెరుగుతున్నందున కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపామని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారని, ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. కరోనా రహిత పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఓటర్లతో పాటు సిబ్బందిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుశీల్ చంద్ర అన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ఇందులో 8.55 కోట్ల మంది మహిళా ఓటర్లు, 24.9 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతి, యువకులు ఉన్నట్టు చెప్పారు. మొత్తం 2,15,368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో 16 శాతం పోలింగ్ కేంద్రాలను పెంచినట్టు పేర్కొన్నారు. గతంలో 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1,250కి తగ్గించారు. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచుతున్నట్టు తెలిపారు. ఇక పోలింగ్ విధుల్లో పాల్గొనే వారిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణించి.. వారికి కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని కేంద్రాన్ని సూచించారు.
ఆన్లైన్ లో నామినేషన్లకు అవకాశం
మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఆన్లైన్ లో నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ లో తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చని తెలిపారు. దీని వల్ల రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలకు పెంపు
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్లో ఈ వ్యయం రూ. 28 లక్షలుగా నిర్ణయించారు. డబుల్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్ సోకిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్సైట్లలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఆ అభ్యర్థులను ఎందుకు ఎన్నుకున్నారో కారణాలు కూడా చెప్పాలని తెలిపారు.
వర్చువల్ ప్రచారాలు నిర్వహించండి
కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వర్చువల్ గా ప్రచారం నిర్వహించుకోవాలని సిఈసి సూచించారు. జనవరి 15 వరకు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహన ర్యాలీలు వంటి బహిరంగ ప్రచారాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత పరిస్థితులను సమీక్షించి ప్రచారాలపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎటువంటి ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహించ కూడదు. అలాగే డోర్ టూ డోర్ (ఇంటింట ప్రచారం)లో కూడా అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతి. వాహన కాన్వారు కి ఐదు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని, అది కూడా వాహనాల మధ్య వంద మీటర్ల దూరం ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన అభ్యర్థికి, పార్టీకి ఎన్నికలు అయ్యే వరకు అనుమతి ఇవ్వమని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్ల గరిష్ట సంఖ్య 40 నుంచి 30కి, గుర్తింపు లేని పార్టీల స్టార్ క్యాంపెయినర్ల గరిష్ట సంఖ్య 20 నుంచి 15కి కుదించినట్లు తెలిపారు. ఓటర్లు, ఎన్నికల నిర్వహణ అధికారులు మాస్క్ లు, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఐదు రాష్ట్రాలకు గానూ 900 మంది ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. అన్ని కరోనా ప్రోటోకాల్ యధావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.