Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థపై వడ్డీ భారం
- విద్య, ఆరోగ్యం, రక్షణ రంగాలపై చేసే ఖర్చూ తక్కువే..!
- దేశ బడ్జెట్ పరిస్థితిపై ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి మోడీ హయాంలో దిగజారిపోయింది. గత పదేండ్లలో అప్పులు పెరిగిపోయాయి. ఆదాయమూ తగ్గిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై వడ్డీ భారమూ పడుతున్నది. మోడీ సర్కారు అనుసరించిన విధానాలతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులకు ముందే దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిన విషయాన్ని నిపుణులు గుర్తు చేశారు. దేశంలో మహమ్మారి ప్రవేశం అనంతరం ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని చెప్పారు. ద్రవ్యోల్బణం ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్నారు. ప్రభుత్వ అప్పులు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతంగా ఉన్నదని నిపుణులు తెలిపారు. అయితే, దేశ ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగలేదన్నారు. అలా అని ప్రభుత్వ, సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేసిందీ కూడా ఆశించినంత స్థాయిలో లేదని ఆర్థిక నిపుణులు చెప్పారు. బడ్జెట్ సెషన్ దగ్గర పడుతున్న సందర్భంలో మోడీ సర్కారు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచనలు చేశారు.
కేంద్రం విధానాలు, మహమ్మారితో వచ్చిన ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వ అప్పులు పెరిగాయన్నారు. ప్రస్తుత దశలో దేశ అప్పులు జీడీపీలో 90 శాతానికి చేరుతున్నాయన్నారు. అయితే, కరోనాకు ముందు ఇవి 70 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విధంగా పెరుగుతున్న అప్పులతో ఆర్థిక వ్యవస్థపై వడ్డీ భారమూ పడుతున్నదన్నారు. మహమ్మారికి ముందు ఈ వడ్డీ భారం అధికంగా 34.8 శాతంగా ఉన్నదన్నారు. గత పదేండ్లుగా ఇందులో మార్పులేదని చెప్పారు. 2011-12లో వడ్డీ భారం 34.6 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, బడ్జెట్ అంచనా ప్రకారం ఈ ఏడాది అది 40.9 శాతంగా ఉండొచ్చు.అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక వ్యవస్థ.. భారత్లోని పరిస్థితులకు భిన్నంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆ దేశాలు తమ దేశ జీడీపీలో అధికం ఆరోగ్య సేవలు, విద్య, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, రక్షణపై అధికంగా ఖర్చు చేస్తున్నాయి. భారత్లో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పదేండ్లలో 10.2 శాతంగానే ఉన్నదన్నారు. ఈ ఏడాది అది 9.9 శాతంగా ఉండొచ్చని అంచనా. అయితే, అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థ కలిగిన దేశాలలాగా కాకుండా భారత్.. ఆరోగ్యం, విద్య, రక్షణ వంటి అంశాలపై చాలా తక్కువగా ఖర్చు చేస్తున్నదని తెలిపారు. అయితే, బడ్జెట్ ప్రసంగాలలో మాత్రం మోడీ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, గణాంకాలను వెల్లడిస్తున్నదని నిపుణులు అన్నారు.