Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది 'ద్వేషంతో నిండిన గళాలకు' ధైర్యాన్నిస్తుంది
- ప్రధానికి ఐఐఎం విద్యార్థులు, ఫ్యాకల్టీ లేఖ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హిందూత్వ శక్తుల ద్వేషపూరిత ప్రసంగాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై ఐఐఎం విద్యార్థులు, అధ్యాపకులు ఆయనకు లేఖ రాశారు. ప్రధాని మౌనం దేశ ఐకమత్యానికి ముప్పును కలిగిస్తుందని పేర్కొన్నారు. మోడీ ఇకనైనా మౌనం వీడాలని కోరారు. అహ్మదా బాద్లోని ఐఐఎం (ఐఐఎం-ఏ), బెంగళూరులోని ఐఐఎం (ఐఐఎం-బీ) లకు చెందిన 183 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రధానికి ఈ లేఖను రాశారు. దేశంలో పెరిగిపోతున్న అసహనంపై ప్రధాని మౌనం '' ద్వేషంతో నిండిన గళాలకు'' దైర్యాన్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. '' దేశంలో పెరుగుతున్న అసహనం మీద మీ (ప్రధాని మోడీ) మౌనం దేశంలోని భిన్న సంస్కృతులకు విలువనిచ్చే మాలాంటి వారిని నిరుత్సాహపరుస్తుంది. అది ద్వేషంతో నిండిన స్వరాలకు ధైర్యాన్నిస్తుంది. ఇది దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పును కలిగిస్తుంది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలను విభజించే శక్తుల నుంచి దూరంగా దేశాన్ని నడిపించాలని ప్రధానిని కోరారు. '' దేశం ప్రస్తుతం భయాందోళనలో ఉన్నది. చర్చిలు వంటి ప్రార్థనాలయాల ధ్వంసమవుతున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా ఆయుధాలు చేబట్టాలనీ, నదమేధం సృష్టించాలని పిలుపులు వస్తున్నాయి. సరైన మార్గంలో దేశాన్ని నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం'' అని లేఖలో వివరించారు.