Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే 1.6లక్షల కేసులు
- సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పాజిటివ్
- 402 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా
- కేంద్ర ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ ఉధృతి వేగంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.6 లక్షల కేసులు నమోదయ్యాయి. రోజురోజూకీ రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 6లక్షలకు చేరింది. చాలా రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10శాతం దాటింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3623 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గుర్తించారు. సాంకేతికంగా ఇప్పటివరకు ఇన్ని కేసులు గుర్తించినప్పటికీ వాస్తవంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతోనే కరోనా కేసులు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది.
బీ కేర్‌ఫుల్ ..ప్రధాని మోడీ
కోవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో ఆరోగ్యశాఖతో పాటు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. థర్డ్‌వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు, వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, మెడికల్ ఆక్సిజన్, ఔషధాల ముందస్తు నిల్వ, వైరస్ ఉధృతిని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల సంసిద్ధత వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా మోడీ సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్ 24న కొవిడ్‌పై ప్రధాని సమీక్ష నిర్వహించారు.
వారికి వర్క్‌ఫ్రమ్ హౌమ్...
దేశంలో కరోనా జోరుగా విస్తరిస్త్నున దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రమ్ హౌమ్ వెసులుబాటు ఇస్తున్నట్టు వెల్లడించింది. అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్ ఫ్రమ్ హౌమ్ సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. కంటైన్మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.
నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు పాజిటివ్
సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి చెందిన 150 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ న్యాయమూర్తులంతా గత మంగళవారం.. జస్టిస్ సుభాష్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమానికి హజరయ్యారు. అనంతరం ఆయనకు కోవిడ్ సోకింది. ఆ తరువాత చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ మరో నలుగురు న్యాయమూర్తులతో కలిసి గత గురువారం కోవిడ్ వ్యాప్తిపై సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణతో కలిసి మొత్తం 32 జడ్జిలున్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. సుప్రీం కోర్టుకు చెందిన 150 మంది ఉద్యోగులు క్వారంటైన్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది.
402 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా
పార్లమెంటు సిబ్బందిలో దాదాపు 400 మందికి కరోనా సోకింది. అధికార వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం పార్లమెంటులో పని చేస్తున్న 1,409 మందిలో 402 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. జనవరి 4 నుంచి 8 వరకు వీరు ఈ వ్యాధికి గురయ్యారు. వీరికి ఒమైక్రాన్ సోకిందేమో తెలుసుకునేందుకు వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సిబ్బందికి అంతర్గత సందేశాలు జారీ అయ్యాయి. 200 మంది లోక్‌సభ సిబ్బందికి, 69 మంది రాజ్యసభ సిబ్బందికి, 133 మంది అనుబంధ సిబ్బందికి కోవిడ్-19 సోకినట్లు ఈ సందేశంలో తెలియజేశారు. కోవిడ్ సోకినవారితో పని చేసే సమయంలో కలిసిన సిబ్బందిని ఐసొలేషన్‌లో ఉంచారు.