Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నిబంధనలు, వ్యాక్సిన్ తప్పనిసరి
న్యూఢిల్లీ : ప్రతీ ఏటా సంక్రాంతి రోజున నిర్వహించే సాంప్రదాయ క్రీడ జల్లికట్టును నిర్వహించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సోమవారం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా నిబంధనలు పాటించాలని, ప్రేక్షకుల సంఖ్యపై పరిమితి విధించాలని, వాక్సినేషన్ తప్పనిసరని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఒపిఎస్) ప్రకారం ప్రతీ ఎద్దుతో పాటు ఎద్దు యజమాని, సహాయకుడు ఈ ఇద్దరినీ మాత్రమే ఎరీనా లోపలికి అనుమతిస్తారు. ఈ ఇద్దరికీ జిల్లా పరిపాలన అధికారులు ఐడి కార్డులు అందిస్తారు. ఈ కార్డులు లేనివారిని రింగ్‌లోకి అనుమతించరు. అలాగే ఈ క్రీడలో పాల్గొనేవారు కూడా పూర్తి వ్యాక్సినేషన్, 48 గంటలలోపు నెగటివ్ ఆర్టి పిసిఆర్ పరీక్ష ఫలితం ధృవపత్రాలు తప్పనిసరిగా అందచేయాలి.
పాల్గొనే క్రీడాకారులకు కూడా జిల్లా అధికారులు ఐడి కార్డులు అందచేస్తారు. జల్లికట్టు నిర్వహించే మూడు రోజుల ముందే ఎద్దు యజమానులు, ఆటగాళ్లకు ఐడి కార్డులు జారీ చేయడం పూర్తి చేయాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. జల్లికట్టుకు 300 మంది ఆటగాళ్లను, 'ఎరుతు విదుతల్' అనే ఎద్దుల రేసింగ్ క్రీడకు 150 మంది ఆటగాళ్లను అనుమతించనున్నారు.
అలాగే ఈ క్రీడల ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారులు కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొంది, నెగటివ్ పరీక్ష నివేదిక కలిగిఉండాలి. అలాగే క్రీడను వీక్షించే ప్రేక్షకుల సామర్థ్యంలో 50 శాతం, లేదా అత్యధికంగా 150 మందిని వీటిలో ఏది తక్కువగా ఉంటే దానిని మాత్రమే అనుమతిస్తారు.