Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ దిగుమతులతో పడిపోయిన ధర
- ఆదుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాసిన రైతులు
న్యూఢిల్లీ : కాశ్మీర్లో యాపిల్ వ్యాపారులు, రైతులు పరిశ్రమను ఆదుకోవాలని ప్రధాని మోడీని కోరుతున్నారు. కోట్లాది మంది ప్రజల జీవనోపాధి యాపిల్ పరిశ్రమతో ముడిపడి ఉందని, తమ సమస్యలు పరిష్కరించాలని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. కాశ్మీర్ లోయలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు యాపిల్ పెంపకందార్లు పెద్ద ఎత్తున నష్టపోయారని, మరోవైపు విదేశాల నుంచి అక్రమంగా మార్కెట్లోకి తరలి వస్తున్న యాపిల్ వల్ల ధర పడిపోయిందని ప్రధానికి తెలిపారు. స్థానికంగా ఉత్పత్తి అయిన యాపిల్ కోల్డ్ స్టోరేజీల్లో, గోడౌన్లలో పెద్ద ఎత్తున నిల్వ ఉందని, సరైన ధర రాకపోవటంతో పండ్లను అమ్ముకోలేకపోతున్నామని సాగుదార్లు, స్థానిక వ్యాపారులు ప్రధానికి రాసిన లేఖలో మొరపెట్టుకున్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, తమ గోడు వినాలని, అక్రమ దిగుమతులకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు.
కాశ్మీర్లో పండ్ల పెంపకందార్ల అసోసియేషన్ 'ఫ్రూట్స్ గ్రోయర్స్ కమ్ డీలర్స్' ఈ లేఖను రాసింది. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న పండ్ల వల్ల కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో పండ్ల మార్కెట్ తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సి వస్తోందని, ఈ విషయంలో ప్రధాని కలుగజేసుకోవాలని వారు లేఖలో పేర్కొన్నారు. కాశ్మీర్లో 70శాతం మంది ప్రజల జీవనోపాధి యాపిల్ పరిశ్రమతో ముడిపడి ఉందని తెలిపారు. మార్కెట్లో సరైన ధర లేక కోల్డ్ స్టోరేజీల్లో 1.50 కోట్ల యాపిల్ బాక్సులున్నాయని, ఇవన్నీ చిన్న చిన్న యాపిల్ పెంపకందార్ల ఉత్పత్తే అని పేర్కొన్నారు.