Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో పార్టీకి రాజీనామా
న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయనగా.. అక్కడ బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో పార్టీని వీడారు. సోమ వారం ఆయన పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత 15 ఏండ్లుగా పార్టీకి సేవలు అందించానని, ఇంకా కొనసాగుతూ అవమానాలు పొందలేనని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పార్టీ నాయకత్వం తనను ఎన్నోమార్లు అవమానించిందని అన్నారు. కొద్ది రోజుల క్రితం మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. మైఖేల్ లోబో మూడో ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.
గత కొంత కాలంగా మైఖేల్ లోబో సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పట్ల బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబడుతున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పెద్ద పీట వేస్తున్నారని, భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే ఎమ్మెల్యేల్ని పార్టీ నాయకత్వం సహించటం లేదని ఆయన ఆరోపించారు. గోవాలో బీజేపీ మొదట్నుంచీ హిందూత్వ ఎజెండాను బలంగా అమలుజేస్తోంది. ఈ తరహా రాజకీయాల్ని పార్టీలోని క్రిస్టియన్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. తమ మాటను లెక్కచేయటం లేదని ఇటీవల రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సాల్దానా, కార్లోస్ అల్మీదాలు మీడియాకు వెల్లడించారు. విధ్వంస, విద్వేష రాజకీయాల వైపు పార్టీ వెళ్తోందని వారు ఆరోపించారు.