Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ
- పంజాబ్ ఘటనపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని మోడీ భద్రతా లోపంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించాలని నిర్ణయించింది. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్, పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రతిపాదనపై కేంద్ర సొలిసిటర్ జనరల్, పంజాబ్ అడ్వకేట్ జనరల్ ఇద్దరూ తమకు అభ్యంతరం లేదని చెప్పారు. విచారణ కమిటిలో సభ్యులుగా చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏకు చెందిన ఐజీ, ఐబీ అధికారులు కూడా ఉంటారని, కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రతినిధ్యం ఉంటుందని సీజేఐ ఎన్వి రమణ వెల్లడించారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ డిఎస్ పట్వాలియా స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీం కోర్టులో విచారణకు ముందే పంజాబ్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ.. షోకాజ్ నోటీసులు ఇచ్చారని ధర్మాసనానికి ఏజీ తెలియజేశారు.
ఏజీ వాదనలపై సీజేఐ స్పందిస్తూ.. దోషులుగా చిత్రించి చర్యలు తీసుకుంటూ.. షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయంపై ఎస్పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని, ఆ విషయం కూడా ముందుగానే రాష్ట్ర ఏజన్సీలకు సమాచారం ఇచ్చినట్లు ఎస్జీ తెలిపారు. ప్రధాని వాహనశ్రేణికి ముందు ఉన్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చే వరకు పంజాబ్ అధికారులు రోడ్డు క్లియర్‌గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ప్రధాని భద్రత వ్యవహారం కాబట్టే తమ ముందుకు వచ్చిన పిటిషన్‌ను విచారణకు తీసుకున్నామని, అయితే కేంద్రం ముందుగానే ఫలానా అధికారులు బాధ్యులు అంటూ చర్యలకు ఉపక్రమిస్తే ఇక తాము విచారణ చేపట్టేది ఏముంటుందని సీజేఐ ఎన్వి రమణ ప్రశ్నించారు. పంజాబ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ భయం నిజమైందని, ఇప్పటికే 7 షోకాజ్ నోటీసులు జారీ చేశారని ధర్మాసనానికి పంజాబ్ అడ్వకేట్ జనరల్ వివరించారు. విచారణ జరగకుండా, కనీసం తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా లేకుండానే తమ రాష్ట్ర అధికారులకు కేంద్రం షోకాజ్ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. కేంద్రానికి చెందిన ఏ ఏజెన్సీ విచారణ చేపట్టినా వాస్తవాలు వెలుగులోకి రావని, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర అధికారులు దోషులుగా తేలితే తనను, తన ప్రభుత్వ అధికారులను ఉరితీయాలంటూ పంజాబ్ అడ్వకేట్ జనరల్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ కమిటీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పడంతో ఏజీ అంగీకారం తెలిపారు.
ధర్మ సంసద్ ద్వేషపూరిత ప్రసంగం
కేసు విచారణకు సుప్రీం ఓకే
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ హిందూ సమావేశంలో ద్వేషపూరిత ప్రసంగం కేసును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ధర్మ సంసద్ హరిద్వార్ ద్వేషపూరిత సమావేశం వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు షేర్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వివాదాస్పద హిందుత్వ నాయకుడు యతి నర్సింహానంద్ నిర్వహించిన హిందువుల సమావేశంలో ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేశారు. ధర్మ సంసద్ సమావేశంలో ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేసిన విషయంపై పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా స్వతంత్ర, నిష్పాక్షిక, విశ్వసనీయ దర్యాప్తు కోసం కోర్టును ఆదేశించాలని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు.ఈ విషయాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ధర్మ సంసద్ ద్వేషపూరిత ప్రసంగం అంశం చాలా ప్రమాదకరమని సుప్రీం కోర్టుకు తెలిపారు. సత్యమేవ జయతే నుంచి దేశ నినాదం మారిపోయిందని అన్నారు.
''విచారణకు ఆదేశించబడలేదు. మేము దానిని పరిశీలిస్తాం. ఇప్పటికే కొంత విచారణ జరుగుతోంది'' అని సీజేఐ అన్నారు. ''ఇది ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. కానీ ఇంకా అరెస్టులు లేవు'' అని సిబల్ బదులిచ్చారు. ''మేం దానిని తీసుకుంటాం'' అని సీజేఐ బదులిచ్చారు.
న్యాయవాది సుమితా హజారికా ద్వారా దాఖలు చేసిన పిటిషన్లో సంసద్‌లో చేసిన ప్రసంగాలు ''మన దేశ ఐక్యత, సమగ్రతకు మాత్రమే తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. కానీ మిలియన్ల మంది ముస్లిం పౌరుల జీవితాలకు కూడా ప్రమాదం కలిగిస్తాయి'' అని పేర్కొంది. ఒక పోలీసు అధికారి నేరస్తులకు తన విధేయతను అంగీకరిస్తున్న వీడియో ఎలా వైరల్ అయిందో ఈ అభ్యర్ధన స్పష్టం చేసింది.