Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదునైన ఆయుధాలతో దాడికి తెగబడ్డ యూత్ కాంగ్రెస్ నాయకుడు
న్యూఢిల్లీ : కేరళలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తను యూత్ కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది గూండాలు అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. ఇదుక్కి జిల్లాలో పైనావ్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు ధీరజ్ రాజేంద్రన్‌పై యూత్ కాంగ్రెస్, కేరళ స్టూడెంట్స్ యూనియన్‌కు చెందిన కొంతమంది గూండాలు సోమవారం దాడికి తెగబడ్డారు. కేరళ టెక్నికల్ యూనివర్సిటీ ఎన్నికలు జరుగుతున్నవేళ ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ ప్రాంగణంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్న తరుణంలో యూత్ కాంగ్రెస్‌కు చెందిన నిఖిల్ పైలీ, మరికొంత మంది పదునైన ఆయుధాలతో ధీరజ్ రాజేంద్రన్పైకి దాడికి దిగారు. ఛాతిభాగంలో తీవ్రంగా గాయపర్చారు. దాంతో అక్కడిక్కడే రాజేంద్ర ప్రాణాలు విడిచాడు. కంప్యూటర్ సైన్స్‌లో ఏడో సెమిస్టర్ చదువుతున్న రాజేంద్రన్ కన్నూర్ జిల్లాకు చెందిన తలైప్రాంబ గ్రామానికి చెందినవాడు. దాడి ఘటనలో అతడితోపాటు ఉన్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అభిజీత్, అమల్ కూడా తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.
ఎస్ఎఫ్ఐ ఖండన
ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ గూండాల దిష్టిబొమ్మ దహనం
కేరళలోని ఇడుక్కిలో కెఎస్‌యూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ గూండాలు ఎస్ఎఫ్ఐ కార్యకర్త ధీరజ్‌ను హత్య చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. సోమవారం హైదరాబాద్‌లో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ గూండాల దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఈ దాడిలో ధీరజ్ చనిపోవడంతోపాటు మరో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. వర్సిటీల ప్రాంగణాల్లో ప్రజాస్వామ్య హక్కులు, శాంతిని కాపాడాలని పనిచేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను హత్య చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. విద్యార్థుల సమస్యలపై పోరాడాలనీ, హత్య రాజకీయాలు మానుకోవాలని సూచించారు. విద్యార్థి హత్యను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ అధ్యక్షులు కె అశోక్‌రెడ్డి, కార్యదర్శి ఎండీ జావేద్, నాయకులు లెనిన్, శ్రీమాన్, నాగేందర్, వేమన తదితరులు పాల్గొన్నారు.