Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ప్రయివేటు కంపెనీల పెత్తనం
- అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్..కంపెనీల ఇష్టారాజ్యం
- నిర్దిష్ట పని గంటలు, ఉద్యోగ భద్రతకు తూట్లు
- కంపెనీలకు అనుకూలంగా చట్టాలు, నిబంధనలు
- ఇదేమని అడిగే అవకాశం లేకుండా చేసిన మోడీ సర్కార్
న్యూఢిల్లీ : ఇండియాలో 'అమెజాన్' కంపెనీ ఒక మోనార్క్‌లా తయారైంది. కార్మికులు, ఉద్యోగుల పట్ల ఇష్టమున్నట్టు వ్యవహరిస్తోంది. దేశీయంగానూ పలు కంపెనీలు 'అమెజాన్'ను అనుసరిస్తున్నాయి. అమెజాన్‌లో కొద్ది నెలల క్రితం డెలివరీ పార్ట్నర్స్కు ఇచ్చే వేతనం రూ.35 నుంచి రూ.10కి (ఒక డెలివరీకి) తగ్గించింది. టెంపో వాహనంలో డెలివరీకి రూ.15 చెల్లిస్తోంది. దాంతో వారి నెల వేతనం రూ.15వేల నుంచి రూ.10వేలకు పడిపోయింది. దీనిపై ఆగ్రహం చెందిన 'డెలివరీ పార్ట్నర్స్' హైదరాబాద్, బెంగుళూర్, ఢిల్లీ, పూణె తదితర నగరాల్లో సమ్మెకు దిగారు. లేబర్ కోడ్లు, ఇతర నిబంధనలన్నీ కంపెనీలకే అనుకూలంగా ఉండటంతో 'డెలివరీ పార్ట్నర్స్'కు న్యాయం జరగలేదు. 'మేక్ ఇన్ ఇండియా' పేరుతో దేశంలో అడుగుపెట్టిన ఫాక్స్‌కాన్, యాపిల్(కోలార్ యూనిట్, కర్నాటక), మాగ్నా ఆటోమోటివ్, ఫోర్డ్ మోటార్స్, వాల్‌మార్ట్..మొదలైన సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ వారు ఆడింది ఆట..పాడింది పాట. వీటిలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు ఎలాంటి చట్టబద్దమైన హక్కులూ లేవు.
అంతా కాంట్రాక్ట్ ఉద్యోగాలే
చెన్నైలో తయారీ యూనిట్ స్థాపించిన తైవాన్ సంస్థ 'ఫాక్స్‌కాన్' ఒక హైటెక్ ఎంఎన్సీ. యాపిల్ సంస్థకు 'ఐఫోన్-12' మోడల్ తయారీ చేసి సరఫరా చేస్తోంది. ఇందులో పనిచేసే కొంతమంది మహిళా కార్మికులు డిసెంబర్, 2021లో సమ్మెకు దిగారు. కంపెనీ తమను బానిసలుగా చూస్తోందని వారు ఆరోపించారు. ఈ కంపెనీ చెన్నై యూనిట్లో దాదాపు 20వేల మంది పనిచేస్తున్నారని, ఇందులో 99 శాతం మందివి కాంట్రాక్ట్ ఉద్యోగాలేనని సమాచారం. కెనడాకు చెందిన 'మాగ్నా ఆటోమోటివ్', కర్నాటకలోని కోలార్‌లో 'విస్టన్ కంపెనీ' తీరు కూడా ఇంతే. యాపిల్ కంపెనీకి ఐఫోన్లు తయారుచేసి సరఫరా చేస్తోంది. 8500 మంది కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఏకపక్షంగా తగ్గించేసింది. కోవిడ్ సంక్షోభ సమయంలో గుజరాత్లో సనాద్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4వేల మందిని ఫోర్డ్ మోటార్స్ ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇదేమని అడగడానికి వీల్లేకుండా చట్టాలు, నిబంధనలు 'మేక్ ఇన్ ఇండియా' కింద ఉన్నాయి.
అంతా మా ఇష్టం..
అమెజాన్, వాల్‌మార్ట్, యాపిల్, ఫాక్స్‌కాన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు(ఎంఎన్సీ) దేశ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అడుగుపెడుతున్నాయి. కేంద్రంలో మోడీ సర్కార్ ఆ కంపెనీలకు అనేక ప్రయోజనాలు కల్పిస్తూ రాచబాట వేస్తోంది. కార్మిక చట్టాల్ని సవరించి కొత్తగా 'లేబర్ కోడ్'లను తీసుకొచ్చింది. రాత్రి పగలు పనిచేయించుకున్నా, హఠాత్తుగా ఉద్యోగం నుంచి తీసేసినా ఎంఎన్సీ కంపెనీలను ప్రశ్నించే వీల్లేకుండా నిబంధనలు ఉన్నాయి. బెంగుళూర్, చెన్నై, గుర్గావ్, హైదరాబాద్..వంటి నగరాల్లో బహుళజాతి సంస్థల దోపిడికి అడ్డూ అదుపు లేదు. 'మేక్ ఇన్ ఇండియా' కింద ప్రధాని మోడీ సర్కార్ ఆ కంపెనీలకు ఇచ్చిన ప్రత్యేక ప్రయోజనాలు, నిబంధనలు ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
అదే బాటలో.. దేశీయ కంపెనీలు
మనదేశంలో అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్..వంటివి ఒక కొత్త తరం కార్మికుల్ని (గిగ్ వర్కర్స్‌గా పిలుస్తున్నారు) సృష్టించాయి. గిగ్ వర్కర్స్‌ను అమెజాన్‌లో 'డెలివరీ పార్ట్నర్స్' అనే గొప్ప పేరుతో పిలుస్తారు. దేశీయ కంపెనీలు స్విగ్గీ, జొమాటో...వంటివి అమెజాన్, వాల్‌మార్ట్‌ను అనుసరిస్తున్నాయి. తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మంచి మంచి పేర్లు తగిలిస్తారు. వేతనం, ఇతర ప్రయోజనాలు, పని గంటల..దగ్గరకు వచ్చేసరికి కంపెనీల ఇష్టారాజ్యం. రాత్రి పూట పనిచేస్తే ఓటీ ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య బీమా ఉండదు. ఉద్యోగం లేదంటూ..హఠాత్తుగా తీసేస్తే కార్మికుడు నోరు తెరిచి అడగే హక్కు లేదు.