Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెకండ్ వేవ్‌నూ మించే అవకాశం
- ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అంచనా
- 24 గంటల్లో.. 1.86 లక్షల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ భయం నెలకొన్నది. మహమ్మారిపై పరిశోధకులు అనేక అంశాల్లో ప్రకటనలు చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులతో దేశంలో థర్డ్‌వేవ్ మొదలైనట్టేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో జనవరి నెలాఖరు వరకు దేశంలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయి (పీక్)కి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ వెల్లడించారు. పీక్ సమయంలో నమోదయ్యే కేసులు.. సెకండ్ వేవ్ ఉద్ధత దశలో బయటపడిన కేసుల సంఖ్యనూ మించే అవకాశమున్నదని తెలిపారు. వారానికి సగటున నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు వస్తాయని అంచనా వేశారు. ఈసారి గరిష్ట స్థాయి చాలా త్వరగా వస్తున్నందునే.. కేసుల పెరుగుదల తీవ్రంగా ఉన్నదని వివరించారు. అనంతరం కేసుల తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ జనవరి చివర్లో గరిష్ట స్థాయి నమోదైతే.. మార్చి మధ్య నాటికి ఈ వేవ్ ముగుస్తుందని చెప్పారు.
'రోజుకు 40వేల కేసులుండొచ్చు'
మహానగరాల్లో కరోనా పరిస్థితులపై ప్రొఫెసర్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జనవరి మధ్య నాటికి గరిష్ట స్థాయి నమోదయ్యే అవకాశమున్నదని తెలిపారు. ఆ సమయంలో రోజుకు దాదాపు 40 వేల కేసులు బయటపడతాయని అంచనా వేశారు. ముంబయి, కోల్‌కతాలోనూ ఈ నెల మధ్యనాటికి గరిష్ట కేసులు వచ్చే అవకాశమున్నదని చెప్పారు. అయితే.. నెలాఖరుకు ఈ నగరాల్లో ప్రస్తుత వేవ్ దాదాపు ముగుస్తుందన్నారు. ఎన్నికల ర్యాలీలపై మాట్లాడుతూ.. ''కేవలం ఈ కార్యక్రమాలను మాత్రమే వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తే.. అది తప్పు. ఇందుకు అనేక కారణాలూ ఉన్నాయి. అందులో ఈ ర్యాలీలూ ఒకటి. వీటిని నిరోధించడం ద్వారా.. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలమనుకోవడం కరెక్ట్ కాదు'' అని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తిని ట్రాక్ చేసే 'సూత్ర కంప్యూటర్ మోడల్'కు అగర్వాల్ నేతత్వం వహిస్తున్నారు. ఇక దేశంలో గత 24 గంటల్లో దాదాపు 1.86 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 1,79,723 కొత్త కేసులు రిజిస్టరయ్యాయి. వీటిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033గా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 146 మంది కరోనాతో మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619గా ఉన్నది. రోజువారి పాజిటివిటి రేటు 13.29 శాతంగా నమోదైంది.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కరోనాపాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు హౌం క్వారంటైన్లో ఉన్నట్టు వివరించారు. ఈ మధ్య తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. రాజ్‌నాథ్ సింగ్.. వాయుసేన అధికారులతో సమావేశమైన విషయం విదితమే. త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ చీఫ్.. రాజ్ నాథ్‌ను కలిసి నివేదికనూ అందించారు. దీంతో ఇప్పుడు కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళనను కలిగిస్తు న్నది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ తీవ్రంగా విజృంభిస్తున్నది. ఈ కారణంతో గత కొన్ని రోజులుగా అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులూ వైరస్ బారినపడుతున్నారు. కాగా ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో నాగ్‌పూర్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఆయన కరోనా బారిన పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా, తన భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయనను ఆస్పత్రికి పంపాలంటూ జైలు అధికారులు, కోర్టును సాయిబాబ భార్య వసంత అభ్యర్థించింది.