Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఓడించకపోతే దేశానికి ప్రమాదం
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
న్యూఢిల్లీ : రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే దేశ ప్రజలకు భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. దేశ ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ సార్వభౌమత్వాన్ని, లౌకికత్వాన్ని ప్రమాదానికి గురి చేస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం త్రిపుర రాష్ట్ర మహాసభ అగర్తలాలో మంగళవారం జరగగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్ మాట్లాడారు. వ్యవసాయ కార్మికులు, కార్మికులు, ఆదివాసీలకు గత త్రిపుర వామపక్ష ప్రభుత్వం అనేక హక్కులు, సౌకర్యాలు కల్పిస్తే వాటన్నిటినీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. చీకటి చట్టాలు రద్దు చేయాలని జరిగిన చారిత్రాత్మక పోరాటం మొత్తం భారత ప్రజానీకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ఆయన అన్నారు. ఆ స్ఫూర్తితో ప్రజానుకూల చట్టాల కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు బీజేపీ ప్రభుత్వం దేశంతో పాటు త్రిపుర రాష్ట్రంలో కూడా ఉపాధి హామీ చట్టాన్ని అటకెక్కించిందని అన్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచి గిరిజన ప్రజల జీవనం మీదనే దెబ్బ కొడుతుందని అన్నారు. ఈశాన్య భారతదేశంలో ఆదివాసీలు, ఇతర ప్రజలను ఐక్యంగా నిలిపి దేశానికి ఆదర్శంగా నాటి వామపక్ష ప్రభుత్వం పరిపాలన చేస్తే, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నేడు బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు ఇతర ప్రజలకు మధ్య చిచ్చుపెట్టి అనైక్యతను రెచ్చగొట్టి, సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఈశాన్య ప్రాంతంలో త్రిపుర రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా సృష్టించిందని ఆయన విమర్శించారు. త్రిపుర ప్రజాతంత్ర ఉద్యమం మీద, ఆదివాసీల మీద బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన దాడులు చేస్తున్నదని, వీటిని ఎదుర్కొని సమరశీల పోరాటాలతో ఆదర్శ నేత దశరద్ దేవ్ బాటలో పయనిస్తూ త్రిపుర వ్యవసాయ కార్మిక ఉద్యమం ముందుకు సాగటం అభినందనీయమని ఆయన అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 350 మంది ప్రతినిధులు ఈ రాష్ట్ర మహాసభకు హాజరు కావటం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తద్వారానే దేశ ప్రజలకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని ఆయన అన్నారు.