Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా జర్నలిస్టులను వేధింపులకు గురిచేయటంపై ఎడిటర్స్ గిల్డ్
న్యూఢిల్లీ : మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్లో కొనసాగుతున్న వేధింపులను ఖండిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, చట్టాన్ని ఉల్లంఘించటమేనని ఎడిటర్ గిల్డ్ ఆ ప్రకటనలో పేర్కొంది. బీజేపీకి అనుబంధంగా ఉన్న రాజకీయ కార్యకర్తలు.. పార్టీ ప్రజాదరణను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగిస్తున్న రహస్య యాప్ 'టెక్ ఫాగ్' ఉనికిని ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ 'వైర్' వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మహిళా జర్నలిస్టులు సహా పలువురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీతో అనుబంధంగా ఉన్న పలువురు వ్యక్తులు ఈ యాప్‌లను వినియోగిస్తున్నారనీ, ముస్లిం మహిళలను వేలం వేస్తున్నట్టు గిట్ హబ్ వంటి యాప్‌లలో ప్రకటించారని తెలిపింది. అధికార పార్టీ, మోడీ ప్రభుత్వ చట్టవ్యతిరేక చర్యలను బహిరంగంగా విమర్శిస్తున్న వారి గొంతును అణచివేసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించింది. ఇటువంటి ట్రోలింగ్లు, వేధింపుల ఉదంతాలను వైర్ తన పరిశోధన ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిందనీ, టెక్ ఫాగ్ యాప్‌లను రూపొదించడం ద్వారా లక్ష్యంగా చేసుకున్న జర్నలిస్టులకు అనుచితమైన, అసభ్యకరమైన సందేశాలను పంపుతోందని విమర్శించింది. ఈ బాధాకరమైన సందేశాల వెనక ఉద్దేశం జర్నలిస్టుల్లో భయాన్ని కలిగించడం, స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించకుండా అడ్డుకోవడమేనని తెలిపింది. ఈ అనుచితమైన చర్యల వెనుక ఉన్న అసలైన నేరస్తులను న్యాయస్థానానికి తీసుకువచ్చేలా విచారణ చేపట్టడం అత్యవసరమని పేర్కొంది. టెక్ ఫాగ్ యాప్ వెనుక అధికార పార్టీతో సంబంధం ఉన్న ప్రభావవంతమైన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది.