Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా ప్రభుత్వ వైఖరికి సీఐటీయూ ఖండన
న్యూఢిల్లీ : సమ్మె చేస్తున్న డాక్టర్లపై హర్యానా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించడాన్ని సీఐటీయూ ఖండించింది. హర్యానా సివిల్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హెచ్సీఎంఎస్ఎ) ఆధ్వర్యంలో మంగళవారం ఒక్క రోజు సమ్మె చేసినందుకే మొత్తంగా ఆరోగ్య సేవల రంగంలో ఆరు మాసాల పాటు సమ్మెలను నిషేధిస్తూ నిత్యావసర సేవల నిర్వహణా చట్టం (ఎస్మా) ప్రయోగించిన తీరును, హర్యానా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. సర్వీసులో వున్న డాక్టర్లకు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ విషయంలో 40శాతం కోటా ఇవ్వాలని, స్పెషలిస్ట్ కేడర్‌ను ఏర్పాటు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ తమ ప్రాణాలను, భద్రతను పణంగా పెట్టి సేవలందించామని, అందువల్ల న్యాయమైన తమ డిమాండ్లను అమలు చేయాలని డాక్టర్లు దీర్ఘకాలంగా కోరుతున్నారు.
కానీ కనీసం వారి డిమాండ్లను పరిశీలించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. కరోనా విధులను, పోస్టు మార్టం సేవలను ఈ సమ్మె నుండి మినహాయించారు. అయినా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించి, ఎస్మాను విధించిందని సిఐటియు విమర్శించింది. బేషరతుగా ఈ ఎస్మాను ఉపసంహరించుకోవాలని, చర్చల ద్వారా డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరింది.