Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరిద్వార్ సమావేశంపై ప్రశ్నించినందుకు అసహనం
- బీబీసీ ఇంటర్వ్యూలో ప్రహసనం
లక్నో : హరిద్వార్‌లో ఇటీవల జరిగిన ధర్మ సంసద్‌లో ముస్లింలను ఊచకోత కోయాలంటూ హిందూ మత పెద్దలు పిలుపులివ్వడంపై ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పలు ప్రశ్నలు అడగడంపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కోపం పట్టలేక తన మైకును విసిరేసి, అక్కడ నుండి లేచివెళ్ళిపోయారు. బీబీసీ హిందీ విభాగం మంగళవారం విడుదల చేసిన ఇంటర్వ్యూలో ఈ ప్రహసనం చోటు చేసుకుంది. హరిద్వార్ సమావేశంలో ముస్లింలపై కొనసాగిన విద్వేష ప్రచారం గురించి అటూ తిరస్కరించకుండా లేదా ఇటు విస్మరించకుండా చాలావరకు సమతుల్యత పాటిస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు భరించలేక అసహనాన్ని వెళ్ళగక్కారు. 'మీతో మాట్లాడను.' అంటూ అక్కడ నుండి లేచి, తన మైకును తీసి పక్కనే గల బీబీసీ జర్నలిస్టుపైకి విసిరేసి వెళ్ళిపోయారు. కెమెరాను ఆఫ్ చేయాల్సిందిగా అడిగారు. ఆ వీడియోను కూడా మౌర్య తొలగించారని బీబీసీ చెబుతోంది. అయితే కెమెరా చిప్ నుండి తిరిగి ఆ వీడియోను పునరుద్ధరించగలిగారు. మౌర్య ఇంటర్వ్యూ ఇలా అర్ధంతరంగా ముగియడానికి ముందుగా, ఆ జర్నలిస్టులను దుర్భాషలాడారు. జర్నలిస్టులా మాట్లాడడం లేదని, ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూ మధ్యలో లేచి వెళ్ళిపోవడానికి ముందుగా ఆయనను, రాజకీయ ర్యాలీలపై కోవిడ్ ఆంక్షలను ప్రస్తావిస్తూ, బిజెపి భవిష్యత్ వ్యూహం గురించి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన మార్గదర్శకాలను మౌర్య స్వాగతించారు. అవసరమైతే తాము డిజిటల్ వేదికను ఉపయోగించకుంటామన్నారు. ఆ రకంగా ప్రజలకు చేరువయ్యేందుకు మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు.
యూపీ ప్రభుత్వం విస్తృతంగా ప్రకటనలు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, కేవలం ఎన్నికల సమయంలోనే తాము ప్రచారం చేయమని, ప్రజలకు అవసరాలు, సమస్యలు వచ్చినపుడల్లా వారికి అందుబాటులో వుంటామని చెప్పుకున్నారు. ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తూ, తమ ప్రభుత్వం గొప్ప పనులు చేసిందని, అందువల్లే అభివృద్ధి రంగంలో ప్రతిపక్షాన్ని కూగా గమనంలోకి తీసుకున్నామని చెప్పారు. నేరస్తులపై యూపీ ప్రభుత్వం చేసిన యాడ్‌లో వికాస్ దూబే ఎందుకు లేరు ? కేవలం ముస్లింలకు సంబంధించిన కొద్దిమంది పేర్లే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించగా, అది మా పార్టీ యాడ్, మీరెలా నిర్ణయిస్తారని మౌర్య ఎదురు ప్రశ్నించారు. బిబిసి జర్నలిస్టు మరోసారి అదే ప్రశ్నను నొక్కి అడగ్గా, మౌర్య అజ్ఞానం ప్రదర్శిస్తూ, తాను ఇంతవరకు ఆ యాడ్‌ను చూడలేదని చెప్పారు.