Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో 132 నగరాల్లో దిగజారిన గాలి నాణ్యత
- సెంటర్‌ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక
న్యూఢిల్లీ : కాలుష్యాన్ని తగ్గించటానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావటంలేదు. విషపూరిత వాతావరణ సమస్యను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినా కాలుష్యం బారిన పడుతున్న నగరాల సంఖ్య పెరుగుతోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక ప్రకారం, 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. మొదటగా 102 నగరాల్లో మాత్రమే జాతీయ ప్రమాణాల కంటే తక్కువ కాలుష్య స్థాయి ఉంటే..అది ఇపుడు 132 నగరాలకు చేరుకున్నది.ఇటీవల కాలుష్య నగరాలపై సుప్రీం కోర్టు మందలించాక..ఢిల్లీ లాంటి మెట్రో నగరంలో వాహనాలపై ఆంక్షలు విధించారు. దుమ్ము,ధూళితో నిండిన ప్రాంతాలపై ఎయిర్ వాటర్ గన్లను వినియోగించారు. అయితే దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కాలుష్యానికి కాసారంలా...
చమురు శుద్ధి కర్మాగారాలు, మెటర్ స్మెల్టర్ సహ పలు పరిశ్రమలకు అడ్డదిడ్డంగా అనుమతులు..ఉద్గారాల ప్రమాణాలు పాటించకపోవటం..సరైన పర్యవేక్షణ లేకపోవటం..వీటికి తోడు పరిమిత నిధుల కేటాయింపు లాంటి కీలక అంశాలు..గాలి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. అయితే కాలుష్యాన్ని అరికట్టే దిశగా.. కేంద్రం ''యుద్ధ స్థాయిలో పనిచేయాలి '' అని రచయితలు శివాంశ్ గిల్డియాల్ , సునీల్ దహియా నివేదికలో పేర్కొన్నారు. '' వాయు కాలుష్యంపై తీవ్రంగా మారిన ఉద్గార భారాన్ని తగ్గించడానికి అన్ని రంగాల్లో కఠినమైన చర్యలు అమలు చేయాలి.'' అని ప్రస్తావించారు.
భారత జనాభాలో 90 శాతం కంటే ఎక్కువ మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించిన ప్రమాణాల కంటే తక్కువ గాలి నాణ్యత ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, వాహనాలు కాలుష్యానికి ప్రధాన వనరులు. చలికాలంలో రైతులు పంట పొట్టలను తగులబెట్టడం వల్ల సమస్య తీవ్రమవుతోంది, సాధారణంగా రాజధాని న్యూఢిల్లీతో సహా ఉత్తరాది నగరాలను ఉక్కిరిబిక్కిరి చేసే పొగమంచుతో కప్పేస్తుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా పది నగరాల్లో అత్యంత కాలుష్యకారమైన నగరాలు ఉంటే (2020) అందులో తొమ్మిది నగరాలు భారత్‌లోనే ఉండటం గమనార్హం.
గజియాబాద్,బులంద్ షహర్,బిసర్క్ జలాల్పూర్,భివండి,నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్,లక్నో, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచే ఎనిమిది నగరాలు ఉండటం..యోగి పాలనకు వాయికాలుష్యం అద్దంపడుతోంది.
పౌరుల అకాల మరణాలు..జీడీపై ప్రభావం
పౌరుల అకాల మరణాలకు కారణమయ్యే కాలుష్య ముప్పును పరిష్కరించటంతో..మోడీ ప్రభుత్వం విఫలమవుతున్నదన్న వాదన వినిపిస్తున్నది. దేశం మురికికూలంలా మారటంతో..2019లో 16 లక్షల 70వేల మంది మరణించినట్టు అంచనా. జనం జేబులపై అదిక ఆరోగ్య వ్యయం, ఉత్పాదక నష్టాలు వెరసి దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావితం చేస్తున్నది. దీనికి తోడు పేలవమైన గాలి నాణ్యత కారణంగా.. వ్యాపార గమ్యస్థానంగా నిలబడలేక.. దేశప్రతిష్ట మసకబారిస్తున్నది.
కార్యాచరణ ఏదీ..?
గ్రాఫ్ఇండియా జాతీయ వ్యూహం 2017 నుంచి 2024 నాటికి 30 శాతం వరకు రేణువుల ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే ఇప్పటికీ కొన్ని నగరాలు, దేశంలోని రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరూ కార్యాచరణ ప్రణాళికలను అందించలేదని సీఆర్ఈఏ నివేదిక పేర్కొంది. వివిధ ప్రదేశాలలో గాలి నాణ్యతపై అధ్యయనాలు వేగవంతం చేయడం చాలా కీలకమని పర్యావరణవేత్త దహియా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
కాలుష్య ప్రమాణాలను అమలు చేయడానికి పవర్ ప్లాంట్ల గడువును పొడిగించినందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం గతంలో విమర్శలను ఎదుర్కొంది. దేశంలోని 70 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి ఇంకా తేదీని నిర్ణయించలేదు. పైగా విద్యుత్ ప్లాంట్లను ప్రయిటుపరం చేయాలనుకుంటున్నది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోక..కార్పొరేట్ వర్గాలు బాగుంటే చాలు అన్న తరహాలో అనుమతులు ఇవ్వటానికి మోడీ ప్రభుత్వం రెడీ అయిపోతోంది.