Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు శాపంగా ఆహార ధాన్యాల సేకరణ నిబంధనలు
భోపాల్ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారన్న ఆనందాన్ని ఆస్వాదించకుండానే.. ఆహార ధాన్యాల సేకరణకు సంబంధించి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విషయంలో రైతులకు కేంద్రం ద్రోహం చేసింది. ఎంఎస్పీపై ఇటీవల చేసిన ప్రతిపాదనపై రైతులు మండిపడుతున్నారు. ఆహార ధాన్యాల సేకరణకు సంబంధించిన నాణ్యత నిబంధనలు మార్చేందుకు ముసాయిదాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆహార నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు అవసరమని ఆ ముసాయిదా ద్వారా చెప్పేందుకు ఎఫ్సీఐ ప్రయత్నిస్తోంది.
ఎఫ్సీఐ చెబుతున్నదేంటీ..?
ప్రజలకు నాణ్యత ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు, దీర్ఘకాలంగా నిల్వ చేసేందుకు.. ప్రపంచ ప్రమాణాలతో కూడి ఆహార ధాన్యాల కోసమే ఈ ముసాయిదా అని ఎఫ్సీఐ చెబుతోంది. తన చర్యను కేంద్రం సమర్థించుకుంటోంది. సేకరించిన ఆహార ధాన్యాల ప్రస్తుత నాణ్యతా ప్రమాణాలను సమీక్షించడానికి, ప్రపంచ ప్రమాణాలతో బెంచ్మార్క్ ఏర్పాటు చేయడానికి ఎఫ్సీఐ చైర్మన్ అధక్షతన గత నెల 31న సమావేశం జరిగింది. వాస్తవంలో ఇటువంటి కఠిన నిబంధనల ద్వారా ఎంఎస్పిని రైతులకు అందకుండా .. కేంద్రం చేపడుతున్న ఓ ఎత్తుగడగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కొనుగోళ్లు లేకుండా చేయడం, ఎంఎస్పీని తగ్గించేందుకు మోడీ సర్కార్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ విరుచుకుపడుతోంది.
ముసాయిదాలో ఏముంది...?
ప్రతిపాదన ముసాయిదా ప్రకారం... గోధుమలో తేమ శాతం కోసం సిఫార్సులు చేయగా.. ప్రస్తుత తేమ పరిమితి 14 శాతాన్ని .. 12 శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించారు. ఇక మట్టి బెడ్డలతో కూడిన గోధుమల పరిమితి గతంలో 0.75శాతం ఉండగా.. ఇప్పుడు 0.50 శాతానికి తగ్గించారు. కొద్దిగా దెబ్బతిన్న గోధుమలను 4 శాతం నుండి 2 శాతానికి, విరిగిన గోధుమ గింజలకు 6 శాతం నుండి 4 శాతానికి పరిమితం చేశారు. ఇక వరి విషయంలో చూస్తే.. అనుమతించదగిన తేమను 17 శాతం నుండి 16 శాతానికి పరిమితం చేశారు. మట్టి, మలినాలతో కూడిన వరికి 2 శాతం నుంచి 1 శాతానికి, తక్కువగా దెబ్బతిన్న, రంగు మారిన గింజలకు 5 శాతం నుండి 3 శాతానికి, విరిగిన బియ్యం శాతాన్ని 25 శాతం నుండి 20 శాతానికి తగ్గించారు.
బియ్యంలో తేమ శాతాన్ని 15 నుండి 14 శాతానికి కోత పెట్టింది. దెబ్బతిన్న బియ్యం పరిమితిని 1 శాతానికి తగ్గించింది. ఇక ఎర్రబారిన ధాన్యాలను కొనుగోలు చేయదు.
కాగా, దీనిపై మాట్లాడేందుకు ఎన్డీటీవీ ప్రతినిధి భోపాల్లోని కరోండ్ మండిని సందర్శించగా.. అక్కడ రైతులు ఉదయం 9 గంటలకు చేరుకొని పడిగాపులు పడుతుండగా.. మండి అధికారులు 12 గంటల తర్వాత రావడం గమనార్హం. ఈ ప్రతిపాదనలపై అక్కడి రైతులను ప్రశ్నించగా.. దీని వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. తేమ వల్ల ఆహార్య ధాన్యాల ధరలు తగ్గుతాయని, ఆ తేమ శాతం తమ చేతుల్లో లేదని తెలిసి కూడా ఇటువంటి చర్యలు దిగడం అనైతికమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట వేసింది మొదలు.. వాటిని అమ్మేంత వరకు ప్రతి చోటా క్యూలో నిలబడాల్సి వస్తుందని బిజ్ర్ కిశోర్ మీనా అనే రైతు తెలిపారు. ఈ ముసాయిదాపై కాంగ్రెస్, ఇతరులు మండిపడుతున్నారు. ఆహార ధాన్యాల కొనుగోలు నుండి తప్పుకునేందుకు ఎఫ్సిఐ ఇటువంటి చర్యలకు దిగుతుందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ అగ్రికల్చర్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ సభ్యులు కేదర్ సిరోహి మాట్లాడుతూ.. ఎంఎస్పీకి స్వస్తి పలికేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఆహార ధాన్యాల సేకరణ నిబంధనలను కఠినతరం చేస్తూ.. దిగుమతులను సడలిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయం అనేది విభిన్న భౌగోళిక పరిస్థితులు, వాతావరణాల్లో చేస్తుంటారని, నాణ్యతలో తేడాలుంటాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని అన్నారు.