Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1130శాతం పెరిగిన వివాదస్పదవ్యాఖ్యలు
- 80శాతం వాటా వారిదే ...ఎన్నికల వేళ 160శాతం పెరుగుదల
- ఎన్డీటీవీ విశ్లేషణలో వెల్లడి
న్యూఢిల్లీ : మరో ఎన్నికల సీజను ప్రారంభమైన నేపథ్యంలో దేశంలో విద్వేష ప్రసంగాలు చేసే ప్రముఖుల సంఖ్య ఎక్కువైపోతోందని ఎన్డీటీవీ విశ్లేషణలో వెల్లడైంది. యుపిఎ-2 ప్రభుత్వంతో పోల్చితే 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1130శాతం పెరిగిందని పేర్కొంది. గత మూడున్నర మాసాల్లో ప్రముఖులు విద్వేష ప్రసంగాలు మరింత పెరిగాయని, ఎన్నికలు సమీపిస్తుండడంతో సగటున 160శాతానికి పైగా పెరిగాయని పేర్కొంది. ఇందులో బీజేపీ వాటా 80శాతానికి పైగా వుంది. ఎన్డీటీవీ తీసుకువచ్చిన వీఐపీల విద్వేష ప్రసంగాల ట్రాకర్ 2009 నుంచి నేతలు చేసిన ప్రకటనలను పరిశీలించింది. వీరిలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఎలు, గవర్నర్లు, పార్టీ నేతలు ఇలా అన్ని స్థాయిల్లో వున్నారు. ఆ ప్రకటనలన్నీ చాలా స్పష్టమైన రీతిలో మతోన్మాదాన్ని, కులతత్వాన్ని రెచ్చగొట్టేలా లేదా హింసను ప్రేరేపించేలా వున్నాయని పేర్కొంది. నేరుగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా లేకపోయినా పరోక్షంగా లేదా ద్వంద్వార్ధ రీతిలో ఒక మతాన్ని లేదా కమ్యూనిటీని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలను కూడా ఈ ట్రాకర్ పరిగణనలోకి తీసుకుంది. అయితే ఇందులో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు లేదా మోటు వ్యాఖ్యలు లేవు. యూపీఏ-2 (2009-14) హయాంలో విఐపిల విద్వేష ప్రసంగాల సంఘటనలు కేవలం 19 వున్నాయి. అంటే సగటున నెలకు 0.3 చొప్పున నమోదయ్యాయి. కానీ, 2014 నుంచి ఈనాటి వరకు మోడీ ప్రభుత్వ హయాంలో, ఇటువంటి సంఘటనలు 348 నమోదయ్యాయి. అంటే సగటున నెలకు 3.7 చొప్పున నమోదయ్యాయి. అంటే 1130శాతం పెరిగిందని ట్రాకర్ పేర్కొంది. పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ జాబితాలో చేరారని డేటా వెల్లడిస్తోంది. అందరికంటే బీజేపీ అగ్ర స్థానంలో వుంది. ఉన్నత స్థాయిలో ఇటువంటి ప్రసంగాలు చేసిన ఘటనలు 297 వున్నాయి. కాంగ్రెస్ రెండో స్థానంలో వుంది. ఆ పార్టీ నేతలు చేసిన ఇటువంటి ప్రసంగాలు కేవలం 10 మాత్రమే నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇటీవలి మాసాల్లో ఈ ధోరణి మరింత పెరిగి, పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఎన్డీటీవీ ట్రాకర్ తెలిపింది. గతేడాది అక్టోబరు నుండి ప్రముఖులు 34 సందర్భాల్లో ఇలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అంటే సగటున దాదాపు నెలకు పది చొప్పున నమోదయ్యాయి. మోడీ హయాంలో నెలవారీ సగటు చూసినట్లైతే 160శాతంపైగా నమోదైంది. ఉదాహరణకు, వారం రోజుల క్రితమే, అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మ తెలంగాణాలో ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లో 370వ అధికరణను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసినట్లుగానే తాము కూడా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని తుడిచిపెడతామని అన్నారు. ''370వ అధికరణ రద్దైన తీరు, రామ మందిర నిర్మాణం ప్రారంభమైనట్లుగానే ఇక్కడ కూడా నిజాం పేరు, ఒవైసీ పేరు ఎప్పటికీ మర్చిపోయేలా చేస్తాం, ఆ రోజెంతో దూరంలో లేదని'' వ్యాఖ్యానించారు. నవంబరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా యూపీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం 'జామ్' పథకాన్ని (జనధన్ బ్యాంక్ఖాతాలు, ఆధార్ కార్డు, మొబైల్స్) తీసుకువచ్చినట్లుగానే సమాజ్వాదీ పార్టీ కూడా జామ్ (జిన్నా, ఆజమ్ఖాన్, ముక్తార్)ను కలిగివుందని వ్యాఖ్యానించారు. ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పదే పదే అబ్బా జాన్ అనే పదాన్ని ఉపయోగిస్తూ వుంటారు. సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కేవలం ముస్లింలే పొందారని పరోక్షంగా ఆరోపించడానికి ఆయన ఈ పదం వాడుతూ వుంటారు. డిసెంబరులో యుపి డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య మాట్లాడుతూ, లుంగీ చాప్స్ గూన్స్, జాలీదార్ టోపీస్ (లుంగీలు, టోపీలు ధరించిన గూండాలు) అంటూ పరోక్షంగా ముస్లింలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. 2017 ఎన్నికలకు ముందు, చేతుల్లో తుపాకులతో జాలీదార్ టోపీలు ధరించి ఎంతమంది లుంగీచాప్ గుండాలు రోడ్లపై తిరుగుతూ కనిపించేవారు ? వారందరూ వ్యాపారస్తులను బెదిరించేవారే, కానీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అటువంటి గూండాలెవరైనా మీకు కనిపించారా? అని ప్రశ్నించారు. బీజేపీ యువజన నేత, కర్నాటక నుంచి ఎన్నికైన ఎంపి తేజస్వి సూర్య డిసెంబరులో మాట్లాడుతూ, పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా ముస్లింలందరూ హిందూ మతంలోకి తిరిగి మారాలని వ్యాఖ్యానించారు.