Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు..
- 400కు పైగా మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. కొద్దిరోజులుగా లక్షపైనే నమోదవుతోన్న కొత్త కేసులు తాజాగా రెండు లక్షలకు చేరువయ్యాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులూ ఐదువేలకు దగ్గరయ్యాయి. మంగళవారం 400కు పైగా కోవిడ్ మరణాలు నమోద య్యాయనీ కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివిటీ రేటు 11.05 శాతానికి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కు పెరిగింది.మంగళవారం 407 మందిలో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఇక కేసుల పరంగా చూస్తే..మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఓవైపు..కరోనా మరోవైపు ఒమిక్రాన్ విరుచుకుపడుతున్న తీరుతో..ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో.. మకర సంక్రాంతి రోజు హరిద్వార్, రిషికేశ్‌లోని గంగానది ఘాట్ల వద్ద పవిత్ర స్నానాలను నిషేధించారు. ఒడిశా సర్కారు కూడా మకర సంక్రాంతి సహా వరుసగా మూడు రోజులపాటు సముద్ర, నదీ తీరాల వద్ద, చెరువుల్లో పుణ్య స్నానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ఆప్ సర్కార్ ..ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లపై నిషేధం విధించగా.. ప్రయివేటు కార్యాలయాలనూ పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది.
24 గంటల్లో 442 మరణాలు..
కరోనా ఉధతితో ప్రస్తుతం క్రియాశీల కేసులు 9 లక్షలు దాటేశాయి. ఆ రేటు 2.65 శాతానికి చేరింది. మొత్తం కేసులు 3.6 కోట్లకు చేరగా..24 గంటల వ్యవధిలో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజుకంటే మరణాల సంఖ్య పెరుగుతున్నతీరుపై ఆందోళనవ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.84 లక్షల మరణాలు సంభవించాయి.
రేపు సీఎంలతో ప్రధాని భేటీ
దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నందున... వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వైద్య సన్నద్ధత, టీకా కార్యక్రమం అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్షించనున్నారు.
ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేసుకోవాలి..కేంద్రం
దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ ..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుదల కారణంగా.. వైద్య కేంద్రాల వద్ద మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. కనీసం 48 గంటలకు సరిపడా బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్ధారించుకోవడంతో పాటు, సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.