Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ యాప్ మాయ.. రహస్య సమాచారం చోరీ
- కృత్రిమ ప్రజాదరణ.. విమర్శకులే టార్గెట్
- సోషల్ మీడియాలో ప్రజల అభిప్రాయాలు తారుమారు
- ఒక న్యూస్‌ను ఫేక్ చేయడానికి యూఆర్ఎల్ల మార్ఫింగ్
- ట్విట్టర్ 'ట్రెండింగ్', వాట్సాప్ ఖాతాల 'హైజాక్'
న్యూఢిల్లీ : రహస్య యాప్‌లతో బీజేపీ సోషల్ మీడియాను నడిపి స్తున్నదా? వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను కూడా సైబర్ దళంతో తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదా? తమకు వ్యతిరేకంగా ఉండే విమర్శకులు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుం టున్నదా? సోషల్ మీడియాలో నకిలీ ఖాతా లతో (ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటవి) రాజకీయ నాయకులు, ఇతర మతాలు, సంస్థలు, ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని నకిలీ 'ట్రెండింగ్' వార్తలను ప్రచారం చేస్తున్నదా? సామాజిక మాధ్యమాల్లో బీజేపీకి ఉన్న బలం అంతా ఉట్టిదేనా? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. దేశంలోని మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ సోషల్ మీడియాను 'మేనేజ్' చేయడంలో ముందుం టుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ 'టెక్ ఫాగ్' అనే యాప్‌తో తనకు కావాల్సిన విధంగా సోషల్ మీడియాను మలచకుంటున్నట్టుగా తెలిసింది. బీజేపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ సెల్)కి చెందిన మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
అత్యంత అధునాతనమైన, రహస్యమైన యాప్ అయిన 'టెక్ ఫాగ్' ఉనికిలో ఉన్నదని సదరు మాజీ ఉద్యోగి ఆరోపించారు. బీజేపీ ప్రజాదరణను కృత్రిమంగా పెంచడం, విమర్శకులను వేధించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను తారుమారు చేయడానికి అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థలు, మద్దతుదారులు, రాజకీయ కార్యకర్తలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సదరు ఉద్యోగి గతేడాది ఏప్రిల్‌లో వరుస ట్వీట్లతో ఆవేదన వెలిబుచ్చారు.
టెక్ ఫాగ్ యాప్ ద్వారా ట్విట్టర్ ట్రెండింగ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న హ్యాష్‌ట్యాగ్‌లను హైజాగ్ చేయడం, బీజేపీకి అనుబంధంగా ఉన్న అనేక వాట్సాప్ గ్రూపులను సృష్టించడం, వాటిని మెయింటేన్ చేయడం, బీజేపీని విమర్శించే జర్నలిస్టులపై ఆన్లైన్ వేధింపులకు దిశానిర్దేశం చేయడం వంటివి ఉంటాయని సదరు ఉద్యోగి వివరించారు. 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆకర్షణయమైన ఉద్యోగాన్ని అందిస్తామని 2018లో జాతీయ సోషల్ మీడియా అండ్ ఐటీ మాజీ హెడ్, బీజేవైఎం నేత, మహారాష్ట్ర ప్రస్తుత ఎన్నికల మేనేజర్ అయిన దేవాంగ్ దవే తమకు హామీ ఇచ్చారనీ, అయితే, దానిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దీంతో తాము ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.
అయితే, టెక్ ఫాగ్ యాప్‌పై ఒక వార్త సంస్థ బృందం దీనిపై పరీక్ష జరిపింది. యాప్ విభిన్న కార్యాచరణలు, యాప్ సృష్టికర్తల గుర్తింపు, దాని వినియోగదారులు, దాని వినియోగాన్ని ప్రారంభించే సంస్థల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఎన్‌క్రిప్ట్ చేసిన ఈమెయిల్‌లు, ఆన్లైన్ చాట్ రూమ్‌ల ద్వారా, ట్విట్టర్ ఖాతా వెనుక ఉన్న వ్యక్తి యాప్ లక్షణాలను ప్రదర్శించే అనేక స్క్రీన్‌కాస్ట్‌లు, స్క్రీన్షాట్లను సంపాదించాయి. దీనిని సోషల్ మీడియా మానిప్యులేషన్ పండోరా యాప్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇందులో నాలుగు ప్రధానమైన ప్రమాదకర అంశాలను గుర్తించారు.
1. పబ్లిక్ నేరేటివ్ ఇంజినీరింగ్
ఈ స్క్రీన్షాట్లు యాప్‌నకు చెందిన వివిధ లక్షణాలను హైలైట్ చేశాయి. ట్విట్టర్ ట్రెండింగ్ విభాగాన్ని, ఫేస్బుక్లో 'ట్రెండ్'ను హైజాక్ చేయడం యాప్ ప్రాథమిక విధుల్లో ఒకటి. ఈ ప్రక్రియ వ్యక్తులు లేదా సమూహాల ట్వీట్లు మరియు పోస్టులను 'ఆటో-రీట్వీట్' లేదా 'ఆటో-షేర్' చేయడానికి యాప్‌లోని అంతర్నిర్మిత ఆటోమేషన్ ఫీచర్లను ఉపయోగిస్తుంది. యాప్ ఆపరేటివ్‌ల ద్వారా నియంత్రించబడే ఖాతాల ద్వారా ఇప్పటికే ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లను స్పామ్ చేస్తుంది.
ఈ ఫీచర్ బీజేపీ, దాని అనుంబంధ సంస్థల ప్రచారాన్ని విస్తరించడానికి, ప్లాట్ఫామ్లో విభిన్న వ్యక్తులకు ఈ కంటెంట్‌ను బహిర్గతం చేయడానికి, తీవ్రవాద కథనాలు, రాజకీయ ప్రచారాలు వాస్తవానికి ఉన్నదాని కంటే ఎక్కువ జనాదరణ పొందేలా చేయడానికి ఉపయోగించబడుతుంది. గతేడాదిలో వచ్చిన 'కాంగ్రెస్ అగైన్స్ట్ లేబరర్స్' అనే హ్యాష్ ట్యాగ్ ఇందులో భాగమే. అధికార బీజేపీకి అనుకూలమైన, కాంగ్రెస్ వంటి ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకమైన హ్యాష్‌ట్యాగ్‌లు 'ట్రెండింగ్' అయ్యేలా అనేక ట్విట్టర్ ఖాతాలనూ ఉపయోగించినట్టు తేలింది. అయితే, ఈ ఖాతాలు యాప్‌లోని ఫీచర్లను ఉపయోగించి రూపొందించబడినవని స్క్రీన్షాట్లు చూపిస్తున్నాయి.
తబ్లిగీ జమాత్, గోడీ మీడియా, ఐ స్టాండ్ విత్ అర్నబ్, స్పీక్ సోనియా, మర్కజ్, ఇస్లామోఫోబియాతో పాటు పలు వివాదాస్పద, రెచ్చగొట్టే హ్యాష్‌ట్యాగ్ కంటెంట్లు ఇందులో ఉన్నాయి. అయితే, ఒక అంశంపై వినియోగదారుల సంఖ్య కంటే 'హ్యాష్‌ట్యాగ్'ల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం.
2. ఫిషింగ్.. వాట్సాప్ ఖాతాల హైజాక్
ఈ యాప్ అందించే మరో భయంకరమైన ఫీచర్ ఏంటంటే.. 'టోకెన్ థెఫ్ట్' లాంటి టెక్నిక్‌ను ఉపయోగించి ప్రయివేటు పౌరుల 'ఇన్‌యాక్టివ్' వాట్సాప్ ఖాతాలను వ్యక్తిగత ఆపరేటివ్‌లు హైజాక్ చేయడానికీ, వారి ఫోన్ నంబర్‌ను ఉపయోగించి వారు 'తరచుగా సంప్రదించే' లేదా 'అన్ని కాంటాక్ట్‌లకు' మెసేజ్ చేయడానికి అనుమతించడం.
3. వేధింపుల కోసం ప్రయివేటు పౌరుల డేటా బేస్
ఈ యాప్ స్క్రీన్ షాట్లు, స్క్రీన్క్యాస్ట్లు ప్రయివేటు పౌరుల విస్తృతమైన, డైనమిక్ క్లౌడ్ డేటాబేస్‌ను వారి వృత్తి, మతం, భాష, వయస్సు, లింగం, రాజకీయ ధోరణి, భౌతిక లక్షణాల ప్రకారం వర్గీకరించబడతాయి. ఈ డేటాబేస్ గూగుల్ షీట్‌ను కనెక్ట్ చేయడం ద్వారా లేదా స్వయంచాలకంగా కీలకపదాలు, పదబంధాలను రూపొందించడం ద్వారా వ్యక్తులు లేదా సమూహాలకు 'స్వయం ప్రత్యుత్తరం (ఆటోమెటిక్ రిప్లై)' ఇవ్వడానికి యాప్ ఆపరేటివ్‌లను అనుమతిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం 'దుర్వినియోగం' లేదా 'అవమానకరమైనవని' స్క్రీన్షాట్లు సూచిస్తున్నాయి.
4. అంతా క్షణాల్లో తొలగించొచ్చు
యాప్ స్క్రీన్లలో ఉన్న మరో ముఖ్యమైన ఫంక్షనాలిటీ ఏమిటంటే, యాప్ ఆపరేటివ్‌లు ఇప్పటికే ఉన్న అన్ని ఖాతాలను క్షణం నోటీసులో తొలగించవచ్చు. రీ మ్యాప్ చేయచ్చు. ఇది ఈ యాప్‌కున్న ప్రత్యేక సామర్థ్యం. ఇది వారి గత కార్యకలాపాలకు సంబంధించిన అన్ని నేరారోపణ సాక్ష్యాలను నాశనం చేయడానికి అనుమతిస్తుంది. కాబట్టి, బీజేపీ సోషల్ మీడియా టీం చేసే జిమ్మిక్కులను గుర్తించడం కష్టమని బృందం ఆరోపించింది.
ద్వేషపూరిత ప్రసంగాలకు షేర్‌చాట్
యాప్ ఆపరేటివ్‌లు మొహల్లా టెక్ ప్రయివేటు లిమిటెడ్ ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన షేర్‌చాట్‌ను ఉపయోగించారని విశ్వసనీయంగా తెలిసింది. నకిలీ వార్తలు, రాజకీయ ప్రచారం, ద్వేషపూరిత ప్రసంగాలను ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆటోమేట్ చేయడానికి ముందు పరీక్షించడానికి ఇలా చేసినట్టుగా సమాచారం. భారత్‌లో ఈ యాప్‌కు 16 కోట్ల మంది వినియోగదారులున్నారని సమాచారం. దాదాపు 14 విభిన్న భాషల్లో సేవలందించే ఈ యాప్‌ను బీజేపీ, దాని అనుబంధ సంస్థలు 'తమ అజెండా'ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అయితే, షేర్‌చాట్ మాత్రం అలాంటిదేమీ లేదని తోసిపుచ్చింది.
టెక్ ఫాగ్ ద్వారా రియల్ న్యూస్‌ను ఫేక్ చేయడానికి యూఆర్ఎల్లను మార్ఫింగ్ చేయడం, బీజేపీ ప్రచారానికి వాట్సాప్‌ను 'హైజాక్' చేయడం వంటివి ఉన్నట్టు దర్యాప్తు బృందం వివరించింది. ఈ మేరకు బీజేపీ సైబర్ టీమ్‌లు పని చేసినట్టు పేర్కొన్నది. అయితే, దీంతో లక్షలాది మంది భారతీయుల గుర్తింపు చౌర్యం ప్రమాదానికి గురయ్యే అవకాశమున్నదని టెక్ నిపుణుల ఆందోళన. బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియా పోకడలను మార్చేందుకు సైబర్ ఆపరేటివ్‌లు ఉపయోగిస్తున్న ఈ రహస్య 'టెక్ ఫాగ్'పై దాదాపు గత 20 నెలలు ఈ బృందం పరిశోధనను సాగించింది.
మహిళల్ని కించపర్చేలా..
మహిళల కోసం పాటు పడుతున్నామని బీజేపీ అంటోంది. వాస్తవానికి వారిని కించపర్చేలా టెక్ ఫాగ్ ను వినియోగిస్తున్నది. మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తిన మహిళల్ని టార్గెట్ చేస్తున్నది. నాడు పెగాసెస్ తో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తే..ఇపుడు టెక్ ఫాగ్ పేరుతో మతరాజకీయంతో..వారి ఖాతాలను గురి చేస్తోంది. జనవరి 1, 2021 నుంచి ఏప్రిల్ 30, 2021 మధ్య ట్విట్టర్లో అత్యధికంగా రిట్వీట్ చేయబడిన 280 మంది మహిళా జర్నలిస్టులు అందుకున్న 46 లక్షల ప్రత్యుత్తరాలను (రిప్లైస్) గమనిస్తే.. 18 శాతం(8 లక్షల కంటే ఎక్కువ ప్రత్యుత్తరాలు) టెక్ ఫాగ్ యాప్ ద్వారా నిర్వహించబడే ఖాతాల నుంచి వచ్చినట్టు కనుగొన్నారు. దీనిపై ప్రధాని మోడీ అస్సలు నోరువిప్పటంలేదు.