Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సమయంలో భద్రతా లోపంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని అత్యున్నత న్యాయస్థానం బుధవారం నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ అదనపు డీజీపీ(భద్రతా విభాగం), పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వ్యవహరిస్తారని తెలిపింది. ప్రధాని మోడీ భద్రతపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జనవరి 5న పంజాబ్‌లోని హుస్సేనీవాలాలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్తున్నపుడు ప్రధాని మోడీ భద్రతకు లోపం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఈ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. ఫిరోజ్‌పూర్ ఫ్లైఓవర్‌పై మోడీ వాహన శ్రేణి 15-20 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ సంఘటన పాకిస్థాన్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఈ సంఘటనకు బాధ్యులను ఈ స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది.
ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు..?
ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు
హరిద్వార్‌లో నిర్వహించిన ధర్మ సంసద్‌లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదో వివరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నామని పేర్కొంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ''ఈ ధర్మ సంసద్‌లు తరచుగా నిర్వహించబడుతున్నాయి. మరొకటి జనవరి 23న ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఉంది'' అని అన్నారు. ఈ రకమైన ద్వేషపూరిత ప్రసంగాలకు ఎటువంటి చట్టం లేదని సిబల్ అన్నారు. గతంలో జరిగిన మాబ్ లిన్చింగ్ల కంటే ఈ ఘటన భిన్నమైన రంగును సంతరించుకుందని ఆయన అన్నారు. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ మాబ్ లిన్చింగ్ సమస్యను పరిష్కరించిన తహసీన్ పూనావల్ల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదని అన్నారు. మత విద్వేష ప్రకటనలు ఇంతకు ముందు చూసినవి, విన్నవి కావని, వారు ''మొత్తం మత సమాజాన్ని నిర్మూలించాలని బహిరంగ పిలుపునిచ్చారని'' సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు.
''ఈ న్యాయస్థానం త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే, ఉనా, కురుక్షేత్ర, దాస్నా, అలీగఢ్ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో 'ధర్మ సంసద్'లు నిర్వహించబడతాయి. దేశమంతటా వాతావరణం కలుషితం అవుతుంది. ఎలాంటి అరెస్టులు జరగలేదు'' అని సిబల్ వాదనలు వినిపించారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకొని హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించింది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన అనేక పిటిషన్లు ఇప్పటికే కోర్టులోని మరొక ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అలా అయితే ఈ కేసును ఆ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్న వాటితో ట్యాగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగం కేసును విడిగా, లేదా మునుపటి కేసులతో కలిపి 10 రోజుల తరువాత లిస్ట్ చేస్తామని సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ తెలిపారు.