Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత కరోనా సంక్షోభ కాలంలో మహిళలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో విస్తృతావకాశాలు ఉన్నాయని బ్రిడ్జిల్యాబ్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. పురుషుల కంటే మహిళలకు అదనపు అవకాశాలు నెలకొన్నాయని విశ్లేషించింది. బ్రిడ్జిల్యాబ్స్ టెక్ ఎంప్లాయిబిటిలీ క్వటింట్ (బీటీఈక్యూ) టెస్ట్‌లో పురుషుల సగటు స్కోర్ 39 శాతంగా ఉంటే.. మహిళలు 42 శాతం స్కోర్ చేయగలిగారని తెలిపింది. 2021-22లో టెక్ ఉపాధిలో 40,000 మందిని శాంపిల్‌గా తీసుకున్నట్టు పేర్కొంది. కాగా.. కంపెనీలు మహిళల టాలెంట్‌ను ఉపయోగించుకోవడంలో అంతరం నెలకొందని బ్రిడ్జిల్యాబ్స్ వ్యవస్థాపకులు నారాయన్ మహదేవన్ పేర్కొన్నారు. అత్యున్నత విద్యాభ్యాసం కలిగిన మహిళలు అనేక కంపెనీల్లో మద్యస్థ స్థాయి హౌదాలో పని చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మహిళలు ఉద్యోగాల్లో చేరి అనంతరం మానెయ్యడంలో అనేక కారణాలున్నాయని పేర్కొన్నా రు.ముఖ్యంగా పెండ్లి,పిల్లలు, తల్లిదండ్రులను చూసుకోవడం ఇతర అంశాలు మహిళలు మధ్యలో పని మానెయ్యడానికి ప్రధాన కారణమన్నారు. ఒక్క సారి పని మానేసి.. తిరిగి ఉద్యోగంలోకి రావడం చాలా క్లిష్టంగా ఉందన్నారు. పని మానేసిన కాలంలో ముఖ్యంగా టెక్నాలజీలో మార్పులు రావడం, నైపుణ్యత కొరవడటం మహిళలను తిరిగి ఉద్యోగాలకు దూరం చేస్తున్నాయన్నారు. ఐటి పరిశ్రమ ఇప్పటికీ పురుషాధిక్యంలోనే ఉందన్నారు. మెట్రో నగరాల కంటే చిన్న పట్టణాల్లోని వారే అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 41 శాతం మంది ఐటీకి సరిపడ టాలెంట్ కలిగి ఉన్నారన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అసోం 32 శాతం, బీహార్ 31 శాతం చొప్పున విద్యార్థులు నైపుణ్యంతో ఉన్నారన్నారు.