Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎస్‌ఎంఎస్ ద్వారా పంజాబ్ ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. '70748 70748' నెంబరుకి ప్రజలు కాల్ చేసి లేదా మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన అభ్యర్థి పేరును చెప్పాలనీ, 24 గంటల అనంతరం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈ నెల 17 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలన్నారు. ప్రజల ఓట్ల ద్వారా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారని అన్నారు. పంజాబ్ ఆప్ పార్టీ శాఖ అధ్యక్షుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ సింగ్‌ని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. భగవంత్ మాన్ సింగ్‌ను సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరాననీ, ముఖ్యమంత్రి అభ్యర్థిని నాలుగు గోడల మధ్య ఎంపిక చేయవద్దనీ, ప్రజల వద్దకు వెళ్లాలని మాన్ సూచించారని కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రిని నిర్ణయిం చేది ప్రజలేనని, పార్టీ అధిష్టానం కాదంటూ ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ప్రధాన పార్టీలేవీ సిఎం అభ్యర్థిని ప్రకటించలేదు.