Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
- ఉన్నావో లైంగికదాడి బాధితురాలి తల్లికి టిక్కెట్
- భాగస్వామి పార్టీలకు సీట్లు ఖరారు చేసిన బీజేపీ
- మా జాబితా కూడా సిద్ధమంటున్న బీఎస్పీ
లక్నో: అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. 125 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. తొలి జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విడుదల చేశారు. ఉన్నావో లైంగికదాడి బాధితురాలి తల్లి ఆశా సింగ్తో సహా 50 మంది మహిళలకు టిక్కెట్లను ప్రకటించారు. వీరిలో ఆశావర్కర్ల కోసం ఆందోళనలు చేసిన పూనమ్ పాండే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ 'వేధింపులు, చిత్ర హింసలకు గురైన బాధితులకు కాంగ్రెస్ అండగా వుంటుందనే సందేశాన్ని ఈ జాబితాతో పార్టీ పంపుతుంది' అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామని మరోసారి ప్రియాంక ఉద్ఘాటించారు. ఈ చరిత్రాత్మక ప్రయత్నం ద్వారా రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలను తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. ఆశా సింగ్ ఉన్నావో నియోజకవర్గం నుంచి, పూనమ్ పాండే షాజహాన్ పూర్ నుంచి పోటీ పడనున్నారు. పాంఖూరీ పాఠక్ నోయిడా నుంచి, మనోజ్ చౌదరీ దాద్రి నుంచి, దీపక్ భాటీ జెవార్ నుంచి పోటీ చేస్తున్నారు.
బీజేపీ కూడా తొలి దశ అభ్యర్థులు, పొత్తు ఉన్న పార్టీలకు సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ విషయంపై కేంద్ర మంత్రి అమిత్షా నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం తరువాత ఈ వివరాలను బయటకు వెల్లడించనున్నారు. సీఎం యోగీ అధిత్యనాధ్ ఆయోధ్య నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం.
కాగా, 300 మంది అభ్యర్థులతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాబితా కూడా ఖరరాయింది. ఇందులో 90 మంది దళిత అభ్యర్థులు ఉన్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా గురువారం వెల్లడించారు. '90 మంది దళితులతో సహా 300 అభ్యర్థుల పేర్లు ఖరారు చేశాం. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే సరికి దళితుల సంఖ్య మరింత పెరగొచ్చు' అని చెప్పారు. బ్రహ్మణ, ముస్లిం అభ్యర్థులకు కూడా సరైన ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ అధినేత్రి మాయావతి జన్మదినమైన జనవరి 15న జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. కాగా, ఈ ప్రస్తుత ఎన్నికలకు 2007 ఎన్నికల్లో విజయవంతమైన దళిత-బ్రహ్మణ ఫార్ములాతో ముందుకు వెళతామని మాయావతి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యూపీలో మొత్తం 403 స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫలితాలను ఐదు రాష్ట్రాలతో పాటు మార్చి 10న ప్రకటిస్తారు.