Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా ఎనిమిదో సెషన్లోనూ క్షీణత
- ఇష్యూ ధరతో పోల్చితే సగానికి పైగా నష్టం
ముంబయి : డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ నూతన కనిష్టాలకు పడిపోయింది. వరుసగా ఎనిమిదో సెషన్లోనూ నేల చూపులు చూసింది. గురువారం మరో 4.80 శాతం లేదా రూ.52 క్షీణించి రూ.1,031.40కు పడిపోయింది. ఇంట్రాడేలో ఇష్యూ ధరతో పోల్చితే దాదాపు 52 శాతం మేర పతనమైంది. దీంతో ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు బోరుమంటున్నారు. గడిచిన ఎనిమిది సెషన్లలో దాదాపుగా 21 శాతం విలువ కోల్పోయింది. ఈ సూచీ 2021 నవంబర్ 18న మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది. అప్పటి నుంచి కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది.
ఇష్యూ సమయంలో రూ.1.39 లక్షల కోట్ల మార్కెట్ కాపిటలైజేషన్ కలిగిన పేటియం తాజాగా రూ.68,960కి పడిపోయింది. బిఎస్ఇలో 50వ స్థానంలో ఉన్న పేటియం.. ప్రస్తుతం 77వ స్థానానికి పడిపోయింది. వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్ ధర రూ.900కు పడిపోవచ్చని బ్రోకరేజీ సంస్థ మాక్క్వారీ సోమవారం పేర్కొంది. ఈ క్రమంలో పేటియం షేర్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులకు మదుపర్లు ఆచీతూచి వ్యవహారిస్తున్నారు.
మార్కెట్లో ఒడిదుడుకులు..
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలు కొనసాగుతుండగా.. గురువారం సెషన్లో మాత్రం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు లాభానష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ ఉదయం 61,259 పాయింట్ల దగ్గర ప్రారంభం కాగా.. ఓ దశలో 61,348 పాయింట్ల గరిష్టాన్ని తాకగా.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 60,949 పాయింట్లకు పడిపోయింది. చివరకు 85 పాయింట్ల లాభంతో 61,235 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 18,257కు చేరింది.