Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవనోపాధులు దెబ్బతినొద్దు
- కోవిడ్‌పై పోరులో రాష్ట్రాలకు ప్రధాని సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రులతో ప్రధానిమోడీ గురువారం చర్చించారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జీనవోపాధులకు పెద్దగా నష్టం జరగకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి స్థానికంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన ప్రాధాన్యతను ప్రధాని నొక్కి చెప్పారు. వంద శాతం వ్యాక్సినేషన్ సాధించేలా 'హర్ ఘర్ దస్తక్' కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. పది రోజుల్లో దాదాపు మూడు కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్లు అందచేయడం చూస్తుంటే ఈ సవాలును ఎదుర్కొనడానికి భారత్‌కు గల సామర్ధ్యం, సన్నద్ధతను తెలియచేస్తోందని అన్నారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లు అత్యుత్తమమైనవని రుజువవుతోందని అన్నారు. 92శాతం మంది పెద్దలకు మొదటి డోసు అందచేయడం ఈనాడు ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని అన్నారు. రెండో డోసు కూడా ఇప్పటికే దాదాపు 70శాతం మంది తీసుకున్నారని చెప్పారు. కరోనా మహమ్మారిపై జరిపే పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త, క్రియాశీల చర్యలు తీసుకోవడాన్ని కొనసాగించాలని, సమిష్టి దృక్పథాన్ని అనుసరించాలని మోడీ కోరారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, సీనియర్ సిటిజన్లకు, ప్రికాషనరీ డోసును ఎంత త్వరగా అందిస్తే, మన ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ అంత పటిష్టంగా మారుతుందని అన్నారు. కోవిడ్‌పై వ్యూహాలు రూపొందించే సమయంలో ఆర్థిక వ్యవస్థ, సామాన్యుల జీవనోపాధుల రక్షణ కూడా చాలా ముఖ్యమని మోడీ స్పష్టం చేశారు. ''సామాన్యుల జీవనోపాధులకు ఆర్థిక కార్యకలాపాలకు తక్కువ నష్టం జరిగేలా చర్యలు వుండాలి. ఆర్థిక క్రమం కొనసాగేలా చూడాలి, కోవిడ్‌ను అడ్డుకునేందుకు రూపొందించే ఏ వ్యూహానికైనా ముందుగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవడం చాలా కీలకమని మోడీ స్పష్టం చేశారు. కాబట్టి స్థానిక చర్యలపైనే మరింతగా దృష్టి పెట్టడం అవసరమన్నారు. సమిష్టి కృషి ద్వారా ఈ కరోనా మహమ్మారిపై పోరాటంలో మనందరం విజయం సాధిస్తామని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై మొదట్లో వచ్చిన సందేహాలన్నీ నెమ్మదిగా తీరుతున్నాయన్నారు. ఏది ఏమైనా మనం అప్రమత్తంగా వుండాలి, జాగ్రత్తగా వుండాలి. ఎలాంటి భయకంపిత పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ పండుగ సీజనులో ప్రజల, ప్రభుత్వ అప్రమత్తత, సన్నద్ధత తగ్గరాదని హెచ్చరించారు.