Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్‌లో నేరాల రేటు 36శాతం
- వరుస ఘటనలు జరుగుతున్న చర్యలు చేపట్టిన బీజేపీ సర్కార్
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలపై పెద్ద సంఖ్యలో దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వంలో చలనం రావటం లేదు. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటోంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సంఖ్య 37వేలు దాటింది. కేసుల విచారణ, బాధితులకు న్యాయం చేకూర్చటంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నా..పాలకులు స్పందించటం లేదు. గిరిజనులు, దళితులపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదని, ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అన్నివైపుల నుంచీ ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాది రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 9,574 నమోదయ్యాయి. ఇందులో కోర్టు విచారణకు వచ్చి..బాధితులకు న్యాయం జరిగే ప్రక్రియ కేవలం 95 కేసుల్లో మాత్రమే ఉందని తెలుస్తోంది.
ఈ రాష్ట్రంలో 2018-2021 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 33,239 నమోదయ్యాయి. నేరాల రేటు 36శాతం దాటింది. గత 20 ఏండ్లలో కేసుల సంఖ్య ఈస్థాయిలో ఎన్నడూ పెరగలేదు. కేసులకు సంబంధించిన సమాచారం రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అసెంబ్లీలో వెల్లడించారు. నిమావార్‌లో జరిగిన సామూహిక హత్యాకాండ ఘటన రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. నిమావార్‌లో ఒక గిరిజన కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు గత ఏడాది జూన్‌లో లభ్యమయ్యాయి. దాదాపు 10 అడగుల లోతున్న గోతిలో వారిని ఎవరో చంపి పాతిపెట్టారని అనుమానాలున్నాయి. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.