Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
- ఫిబ్రవరి 1న బడ్జెట్
-రెండు దశల్లో సమావేశాలు
- తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు
- రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు
- కోవిడ్ నేపథ్యంలో సీట్ల ఏర్పాటు
- ఐదు రాష్ట్రాల ఎన్నికలతో సమావేశాల కాలాన్ని కుదించే అవకాశం
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఓ నెల విరామం అనంతరం రెండో దశ సమావేశాలు మార్చి 14న ప్రారంభమై, ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. హౌలీ కారణంగా మార్చి 18న సిట్టింగ్ ఉండదు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల అదనపు సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను షిఫ్ట్‌లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. భౌతిక దూరం పాటించేవిధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు అన్నారు. కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా నిర్వహించేందుకు వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ నెలాఖరుకు కోవిడ్ పరిస్థితినిబట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మెన్ ఎం వెంకయ్య నాయుడు ఈ నెల 25, 26న సమావేశమై సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలో నిర్ణయిస్తారన్నారు. కొందరు పార్లమెంటు సభ్యులకు కోవిడ్ సోకినందువల్ల ఈ సమావేశాల కాలాన్ని కుదించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికలు కూడా పార్లమెంటు సమావేశాల కుదింపునకు కారణం కావచ్చునని తెలిపారు. ఇటీవల దాదాపు 400 మంది పార్లమెంటు సిబ్బంది కోవిడ్-19 వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణకు సంబంధించిన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షించారు. వయసు 60 ఏండ్లు పైబడిన ఎంపిల పట్ల మరింత శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరిస్థితిని సమీక్షించారు. ఉభయ సభలు సజావుగా జరిగేలా ప్రణాళికను సిద్ధం చేయాలని ఉభయ సభలకు సూచనలు ఇచ్చారు.