Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండంకెల స్థాయిలోనే టోకు ద్రవ్యోల్బణం
- డిసెంబర్‌లోనూ 13.56 శాతంగా నమోదు
న్యూఢిల్లీ : దేశంలో ధరల సెగ కొనసాగుతూనే ఉంది. 2021 డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) నాలుగు మాసాల గరిష్ట స్థాయికి చేరింది. ముఖ్యంగా అహార ధరలు పెరగడంతో డబ్ల్యుపిఐ 13.56 శాతంగా నమోదయ్యింది. రెండంకెల స్థాయిలో డబ్ల్యుపిఐ కొనసాగడం ఇది వరుసగా తొమ్మిదో మాసం కావడం ఆందోళనకరం. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ సూచీ దిగిరావడం లేదు. క్రితం నవంబర్‌లో 14.23 శాతంగా.. 2020 డిసెంబర్‌లో 1.95 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన మాసంలో అహార ఉత్పత్తుల ధరలు ఏకంగా 9.56 శాతం ఎగిసి 23 మాసాల గరిష్ట స్థాయికి ఎగిశాయి. ఇంతక్రితం నవంబర్‌లో ఈ సూచీ 4.88 శాతంగా ఉంది. ఇదే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 3.91 శాతంగా ఉండగా.. గడిచిన డిసెంబర్‌లో అమాంతం 31.56 శాతం పెరిగాయి. పప్పులు, గోదుమలు, తృణధాన్యాలు తదితర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. కాగా.. ఆలు, ఉల్లి, పళ్లు, గ్రుడ్ల ధరలు స్వల్పంగా తగ్గాయి.
వంట నూనెలు, ప్రాథమిక లోహాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, అహార్పోత్తులు, వస్త్ర, కాగితం తదితర ఉత్పత్తుల ధరల పెరుగుదలతో టోకు ద్రవ్యోల్బణం అధికంగా నమోదయ్యిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తన రిపోర్ట్‌లో పేర్కొంది. తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 11.92 శాతం నుంచి 10.62 శాతానికి తగ్గింది. మరోవైపు ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 32.30 శాతంగా చోటు చేసుకుంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. అహారోత్పత్తులు, ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదలతో 2021 డిసెంబర్‌లో రిటైల్ వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ)5.59 శాతానికి ఎగిసింది. దీంతో ఐదు మాసాల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంతక్రితం నవంబర్‌లో ఇది 4.91 శాతానికి, అక్టోబర్‌లో 4.48 శాతానికి పెరిగింది.
2020 డిసెంబర్‌లో 4.59 శాతంగా చోటు చేసుకుంది. ఆ తర్వాత 2021 జులైలో గరిష్టంగా 5.59 శాతంగా నమోదయ్యింది. ఈ స్థాయిలో తిరిగి డిసెంబర్‌లో చోటు చేసుకోవడం ఆందోళనకరం. అధిక ద్రవ్యోల్బణం వల్లే ఆర్‌బిఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 9న ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరుగనుంది.